monkey: దారుణం.. కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి!

మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు

Published : 29 Jul 2021 15:44 IST

కర్ణాటకలో ఘోరం.. 30 వానరాలు మృతి

హసన్‌: మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హసన్‌ జిల్లా బెలూర్‌ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఈ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచులు మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా.. అందులో కోతుల కన్పించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. మొత్తం 30 వానరాలు చనిపోగా.. మరో 20 గాయపడ్డాయి. దీంతో ఆ యువకులకు గాయపడిన కోతులకు బయటకు తీసి నీరు తాగించారు. ఇందులో 18 కోతులు కోలుకోగా.. మరో రెండింటిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులకు విషం పెట్టి, సంచుల్లో కుక్కారని, సంచుల పై నుంచి బలంగా కొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరణించిన వానరాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. విషం ఆనవాళ్లు కన్పించినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్‌దీప్‌ హుడా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని