icon icon icon
icon icon icon

మా మీదే ఎడాపెడా కేసులు పెట్టిస్తే ఎలా?: ఆర్వోకు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి హెచ్చరిక

‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడమ్‌.. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం అని గుర్తుంచుకోవాలి.

Updated : 25 Apr 2024 08:00 IST

ఒంగోలు, న్యూస్‌టుడే: ‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడమ్‌.. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం అని గుర్తుంచుకోవాలి. మా మీద ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు.. మేం ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త.. కాస్త చూసీచూడనట్లు వెళ్లండి..’ అంటూ వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మహిళా రిటర్నింగ్‌ అధికారిని హెచ్చరించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. వైకాపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక చంద్రశేఖర్‌పై మూడు నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ నెల 22న చంద్రశేఖర్‌ భార్య తన భర్త తరఫున నామినేషన్‌ దాఖలు చేసేందుకు తమ కుమారుడితో కలిసి వెళ్లారు. కుమారుడు మైనర్‌ కావటంతో పోలీసులు అడ్డుకున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రిటర్నింగ్‌ అధికారిణి శ్రీలేఖతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తాము నిబంధనల మేరకే పనిచేస్తున్నామని, నియమావళిని ఉల్లంఘిస్తేనే కేసులు నమోదు చేశామని ఆర్వో బదులిచ్చారు. అయినా యంత్రాంగం తీరుపై చెవిరెడ్డి అసహనం వెలిబుచ్చారు. ముందుగా ఆర్‌ఓ కేంద్రంలోకి కూడా చెవిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించారు. ఆర్వో కార్యాలయంలోకి వెళ్లే ప్రతి ఒక్కరూ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. సెల్‌ఫోన్లు వెంట తీసుకెళ్లకూడదు. ఈ రెండు నిబంధనలనూ ఆయన అతిక్రమించారు. ప్రతి నామినేషన్‌ను ఆర్వో కార్యాలయంలో వీడియో చిత్రీకరించాలి. చెవిరెడ్డి ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పటంతో ఆ సమయంలో వీడియో చిత్రీకరణ నిలిపివేసినట్లు తెలిసింది. మహిళా ఆర్‌ఓ పట్ల చెవిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img