cheating case: పూజలు చేయిస్తే కమీషన్‌ వస్తుందంటూ మహిళలకు శఠగోపం

పూజలు చేయిస్తే కమీషన్‌ వస్తుంది. కొంత పెట్టుబడి పెడితే కూర్చొన్న చోటే లక్షాధికారి అవుతారని నమ్మించిన ఓ పూజారి మహిళలకు శఠగోపం పెట్టాడు. ఇంట్లో ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర.. ఇలా భారీగా డబ్బు వసూలు చేశాడు. మాయమాటలతో మహిళల వద్ద భారీగా..

Updated : 29 Jul 2021 13:13 IST

డిచ్‌పల్లి: పూజలు చేయిస్తే కమీషన్‌ వస్తుంది. కొంత పెట్టుబడి పెడితే కూర్చొన్న చోటే లక్షాధికారి అవుతారని నమ్మించిన ఓ పూజారి మహిళలకు శఠగోపం పెట్టాడు. ఇంట్లో ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర.. ఇలా భారీగా డబ్బు వసూలు చేశాడు. మాయమాటలతో మహిళల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి ఉండాయించిన ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలో చోటు చేసుకుంది. పూజారి చేతిలో మోసపోయాం న్యాయం చేయాలంటూ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రూ.5వేల మొదలు రూ.25 లక్షల వరకు వసూలు చేశాడు. మొత్తం రూ.కోటి పైగా వసూలు చేసి కనిపించకుండా పోయాడు.

డిచ్‌పల్లి మండలం ధర్మారం (బీ)లోని ఓ ఆలయానికి గతేడాది నవంబరులో శ్రీనివాసశర్మ అనే అర్చకుడు వచ్చాడు. గ్రామస్థులు అక్కడే ఆశ్రయం కల్పించారు. నోములు, వ్రతాల కోసం వచ్చే మహిళలతో కొన్నాళ్లు ప్రత్యేక పూజలు చేయించాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. గ్రహస్థితి సరిగా లేదు.. కుటుంబసభ్యుల ఆరోగ్యం బాగుండటం లేదని వచ్చేవారితో సుమంగళి, మాగ పూజలు చేయించేవాడు. తనతో ఎన్‌ఆర్‌ఐలు, సినీ పరిశ్రమకు చెందిన వారు, నిర్మాతలు పూజలు చేయించుకొంటున్నారు. వాళ్లు ఇక్కడికి రాలేరని వారి పేరుపై పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్‌ పొందొచ్చని నమ్మించాడు. రూ.10వేలు పెడితే రూ.12వేలు, రూ.15వేలు పెడితే రూ.20 వేలు తొలుత ఇవ్వడంతో అందరూ నమ్మారు. కమీషన్‌ డబ్బుల్లోనూ కొంత హుండీలో వేయించాడు. అసలే కరోనా కాలం.. ఏపని చేద్దామన్నా దొరకట్లేదు.. ఇంట్లో ఉండి కమీషన్‌ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని గాలం విసిరాడు. అది నమ్మి చాలా మంది అత్తకు తెలియకుండా కోడలు, భర్తకు చెప్పకుండా భార్య పెట్టుబడి పెట్టారు. ఇంట్లో తెలియకుండా మహిళలంతా పూజారికి డబ్బులు ఇచ్చారు. అందరి వద్దా అందిన కాడికి వసూలు చేసిన ఘనుడు కనిపించకుండా పోయాడు. కొద్దిరోజులు ఫోన్‌లో మాట్లాడిన పూజారి... తర్వాత అతని ఫోన్‌కూడా పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు నిన్న పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి కోసం, ప్రసవం గురించి, పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చుల కోసం.. ఇలా రకరకాల అవసరాల కోసం దాచుకున్న సొమ్మును పూజారి చేతిలో పెట్టిన మహిళలు లబోదిబోమంటున్నారు.

భూమి అమ్మి రూ.25లక్షలు పెట్టుబడి పెట్టి

నిజామాబాద్‌ నగరానికి చెందిన ఓ మహిళ తన భర్త ఆరోగ్యం బాగోలేదని పూజారిని ఆశ్రయించగా గ్రహస్థితి బాగాలేదని పూజలు చేయించాడు. పూజలకు పెట్టుబడి పెడితే కమీషన్‌ వస్తుందంటూ ఆశ పెట్టగా ఆమె భూమి విక్రయించగా వచ్చిన రూ.25లక్షలు పలు దఫాలుగా ఇచ్చి మోసపోయారు. నందిపేట్‌ మండలం ఆంధ్రానగర్‌కు చెందిన ఓ మహిళ రూ.10లక్షల వరకు ఇచ్చినట్టు తెలిసింది. నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ రూ.6లక్షలు, బోధన్‌ మండలం పెగడాపల్లికి చెందిన పలువురు మహిళలు రూ.లక్షల్లో సమర్పించుకొన్నట్టు తెలుస్తోంది. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ)లోనే 40 మంది వరకు రూ.లక్షలు ఇచ్చి మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా అందరి వద్ద నుంచి దాదాపు రూ.1.20కోట్లు తీసుకొని పూజారి ఉండాయించినట్టు బాధితులు చెబుతున్నారు.

వ్యక్తిగత వివరాలు తెలియకుండా జాగ్రత్తలు

ధర్మారంతో పాటు నిజామాబాద్‌, బోధన్‌ మండలం పెగడాపల్లి, నందిపేట్‌, ఆంధ్రానగర్‌, శ్రీనగర్‌ తదితర గ్రామాలకు చెందిన మహిళలు డబ్బులు ఇచ్చారు. పూజారిగా చేరిన శ్రీనివాసశర్మ... తన ఊరు, చిరునామా తెలియకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. కరీంనగర్‌లోనూ ఓ ఆలయంలో ప్రధాన పూజారిగా చేసి ఇక్కడికి వచ్చానంటూ నమ్మించాడు. ఆధార్‌కార్డు, ఇతర వ్యక్తిగత గుర్తింపు వివరాలు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కొన్నాళ్లకు ధర్మారం(బీ)కి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. మరొకరు తమ పేరుతో సిమ్‌కార్డు కొనిచ్చారు. వారిచ్చిన సెల్‌ఫోన్‌ నంబరుతోనే పరిచయాలు పెంచుకొన్నాడు. తీరా సదరు వ్యక్తి కనిపించకుండా పోవడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పారిపోయే ముందు బాధితులకు ఒకరి చెక్కులను మరొకరికి ఇచ్చాడు. తీరా అందరూ ఒకచోట చేరినప్పుడు చెక్కులన్నీ ఒకరివి మరొకరికి ఇచ్చినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని