Road Accident: పండగవేళ.. ఆ ఇంట కారుచీకట్లు

దీపావళిని ఘనంగా జరుపుకోవాలని భావించిన వారింట అమావాస్య చీకట్లు అలుముకున్నాయి. పట్నంలో పండగ సామగ్రి కొని కారులో ఆనందంగా గ్రామానికి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులపై మృత్యువు పాశం విసిరింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Published : 04 Nov 2021 06:41 IST

 కామారెడ్డి జిల్లాలో  రోడ్డు ప్రమాదం  

  నలుగురి దుర్మరణం

  మృతుల్లో నాలుగేళ్ల బాలుడు

  మరో నలుగురికి గాయాలు

కామారెడ్డి నేరవిభాగం, తాడ్వాయి, న్యూస్‌టుడే: దీపావళిని ఘనంగా జరుపుకోవాలని భావించిన వారింట అమావాస్య చీకట్లు అలుముకున్నాయి. పట్నంలో పండగ సామగ్రి కొని కారులో ఆనందంగా గ్రామానికి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులపై మృత్యువు పాశం విసిరింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన వీరపేట శ్రీనివాస్‌, జగన్‌, మాందాసు సోదరులు. వీరంతా ఈసారి దీపావళిని ఘనంగా నిర్వహించుకోవాలని భావించారు. ఇందులో భాగంగా కుమార్తె, అల్లుడు నాజోజు ఆనంద్‌కుమార్‌ను మామ శ్రీనివాస్‌ ఇంటికి పిలిచారు. కుటుంబ సభ్యులంతా కలిసి పండగ వస్తువుల కొనుగోలుకు బుధవారం కారులో కామారెడ్డికి వెళ్లారు. పనులు పూర్తిచేసుకొని ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ శివారుకు చేరుకోగానే భారీవర్షం పడింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌(60), ఆయన సోదరుడు జగన్‌(55), అల్లుడు నాజోజు ఆనంద్‌కుమార్‌(31) అక్కడికక్కడే మృతి చెందారు. మనవడు(ఆనంద్‌ కుమారుడు) శుశాంక్‌ (4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్‌ మరో తమ్ముడు మాందాసు (35), కుమారుడు అమర్‌కాంత్‌(19), చిన్న తమ్ముడి కుమారుడు శ్రీహర్ష(3), మరో మనవడు అశ్వంత్‌(3) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కారు సీట్ల మధ్య అమర్‌కాంత్‌ ఇరుక్కుపోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన పోలీసులు, స్థానికులు పొక్లెయిన్‌ సాయంతో బయటకు తీశారు. 

ఒడిలో చిన్నారితో: ప్రమాదానికి జోరుగా కురిసిన వర్షంతో రోడ్డుపైకి వరద చేరడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు నడుపుతున్న ఆనంద్‌ తన ఒడిలో శుశాంక్‌ను కూర్చోబెట్టుకోవడంతో వాహనం అదుపు తప్పి ఉంటుందని ఘటనా స్థలంలోని వ్యక్తులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని