Crime News: ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థిని బలవన్మరణం

ప్రేమించాలంటూ ఓ యువకుడు వెంటబడుతుండటంతో నిరాకరిస్తూ వచ్చిన ఓ విద్యార్థిని.. వేధింపులు ఎక్కువ కావడంతో తన ప్రాణాన్నే బలిచ్చింది.

Published : 12 Sep 2021 07:12 IST

ఖమ్మం జిల్లాలో ఘటన

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రేమించాలంటూ ఓ యువకుడు వెంటబడుతుండటంతో నిరాకరిస్తూ వచ్చిన ఓ విద్యార్థిని.. వేధింపులు ఎక్కువ కావడంతో తన ప్రాణాన్నే బలిచ్చింది. పదిహేనేళ్ల ప్రాయంలోనే లోకాన్ని వీడింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బడికి వెళ్లే దారిలోనే నివాసముండే సాయికృష్ణ(20) అనే యువకుడు ప్రేమించాలంటూ ఆమెను వేధిస్తుండేవాడు. దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో యువకుడిని మందలించారు. అయినా ప్రవర్తనను మార్చుకోని సాయికృష్ణ ఈ నెల 9న బాలిక పాఠశాలకు వెళ్లి వస్తుండగా వెంటబడ్డాడు. ప్రేమించకుంటే చచ్చిపోతానంటూ బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆమె దారిలో కలిసిన బంధువులకు వేధింపుల విషయాన్ని చెప్పి ఇంటికి వెళ్లింది. కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని