Nellore: గుంతలో పడిన ఇద్దరు పిల్లలను కాపాడి.. తల్లులు మృతి

నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుంతలో పడిన తమ పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందిన ఘటన కలచి వేసింది.

Updated : 31 May 2023 18:58 IST

నెల్లూరు: నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుంతలో పడిన తమ పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందిన ఘటన స్థానికులను కలచి వేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్నానది రివిట్‌మెంట్‌ వాల్‌ నిర్మాణం కోసం ఇటీవల గుంతలు తవ్వారు. బుధవారం సాయంత్రం ఆడుకుంటూ అటుగా వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోయారు. ఆ ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు వారి తల్లులు షాహినా, షబీనా గుంతలోకి దూకారు. చిన్నారులను కాపాడిన తర్వాత వారిద్దరూ గుంతలో నుంచి పైకి రాలేక.. బురదలో చిక్కుకుపోయి ప్రాణాలొదిలారు.

గత కొంతకాలంగా రివిట్‌మెంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో జాప్యం కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. తెదేపా నగర ఇన్‌ఛార్జి  కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని