Viveka Murder case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి కీలక సాక్షుల వాంగ్మూలాలు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది.

Updated : 21 Jul 2023 20:00 IST

హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ.. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం, వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ అటెండర్‌ గోపరాజు నవీన్‌కుమార్‌ సాక్షులుగా ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. 2019 మార్చి 15న జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉన్నట్లు సాక్షులు తెలిపారని సీబీఐ పేర్కొంది. మేనిఫెస్టోపై చర్చించేందుకు తెల్లవారుజామునే సమావేశమైనట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. 

సీబీఐ సేకరించిన వాంగ్మూలాలు.. ఇలా ఉన్నాయి...

సీఎం జగన్‌ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి..

‘‘సమావేశం జరుగుతుండగా అటెండర్‌ నవీన్‌ తలుపు తెరిచారు. భేటీ నుంచి బయటకు రావాలని పిలిచారు. ఎంపీ అవినాష్‌రెడ్డి లైన్‌లో ఉన్నారని నవీన్‌ నాకు ఫోన్ ఇచ్చారు. వివేకా మరణించారని అవినాష్‌ నాకు ఫోన్‌లో చెప్పారు. ఎలా జరిగిందని అవినాష్‌రెడ్డిని అడిగాను. బాత్‌రూమ్‌లో మృతదేహం ఉందని.. చాలా రక్తం కూడా ఉందని చెప్పారు. జగన్‌కు సమచారం ఇవ్వండని చెప్పి అవినాష్‌ ఫోన్‌ కట్‌ చేశారు. వివేకా మరణం విషయం జగన్‌కు నేను చెవిలో చెప్పాను. బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌లో రక్తం విషయం కూడా చెప్పాను. జగన్‌ ముందు ఇంటికి వెళ్లి తర్వాత పులివెందుల వెళ్లారు. అవినాష్‌తో ఐదుసార్లు ఎందుకు మాట్లాడారని సీబీఐ అడిగింది. జగన్‌ పర్యటన కోసమే ఐదుసార్లు ఫోన్‌ చేసి ఉంటారని చెప్పా. జగన్‌ ఫోన్‌ వాడరు.. పీఏ లేదా నా ఫోన్‌లోనే మాట్లాడతారు’’ 

వివేకా హత్య కేసులో సాక్షిగా వైఎస్‌ షర్మిల

విశ్రాంత సీఎస్‌ అజేయ కల్లం..

‘‘లోటస్‌పాండ్‌లో ఉండగా ఉదయం 5.30 గంటలకు అటెండర్‌ తలుపు కొట్టారు. వైఎస్‌ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్‌ జగన్‌కు చెప్పారు. బయటకు వెళ్లి 10 నిమిషాల తర్వాత జగన్‌ మళ్లీ వచ్చారు. బాబాయ్‌ ఇక లేరనే విషయాన్ని జగన్‌ నిలబడే మాకు చెప్పారు’’

సీఎం జగన్‌ అటెండర్‌ జి.నవీన్‌ వాంగ్మూలం.. 

‘‘ఉదయం 6.30కి అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేసి జగన్‌ ఉన్నారా? అని అడిగారు. కృష్ణమోహన్‌రెడ్డి, జీవీడీ తదితరులతో జగన్‌ సమావేశామయ్యారని చెప్పాను. కృష్ణమోహన్‌రెడ్డికి వెంటనే ఫోన్‌ ఇవ్వమని అవినాష్ చెప్పారు. సమావేశ గదికి వెళ్లి అవినాష్ లైన్‌లో ఉన్నారని కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్‌ ఇచ్చాను. అవినాష్‌, కృష్ణమోహన్‌రెడ్డి ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు’’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌ తెలిపాడు.

వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

‘‘భేటీ సమయంలో ఎవరో వచ్చి వివేకా మరణించారని జగన్‌కు చెప్పారు. వివేకా మరణంపై జగన్‌కు చెప్పింది ఎవరో నాకు గుర్తులేదు’’ అని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని