Viveka murder case: వివేకా హత్య కేసులో సాక్షిగా వైఎస్‌ షర్మిల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్‌ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది.

Updated : 21 Jul 2023 15:14 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం సమర్పించింది. గతేడాది అక్టోబర్‌ 7న దిల్లీలో షర్మిల సీబీఐకి వాంగ్మూలమిచ్చిన విషయం తెలిసిందే. వాంగ్మూలంలో ఆమె పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్థిక వ్యవహారాలు కాదు.. పెద్ద కారణం ఉంది

‘‘నా వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు.. పెద్ద కారణం ఉంది. అవినాష్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చు. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడికి టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారు. కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబాయ్‌ పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను’’ అని షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలు సేకరిస్తున్నాం: సీబీఐ

కుటుంబంలో కోల్డ్‌వార్‌ ఉండేది..

ఎంపీగా వివేకానే పోటీచేయకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని షర్మిలను సీబీఐ ప్రశ్నించింది. దీనికి ఆమె సమాధానమిస్తూ ‘‘బహుశా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఎంపీగా పోటీకి ఆయన ఆసక్తి చూపకపోయుండవచ్చు. విజయమ్మపై వివేకా పోటీ చేశాక కొంతదూరం పెరిగింది. ఆ కారణంగా ఎలాంటి టికెట్‌ దక్కకపోవచ్చని వివేకా భావించారు. ఎమ్మెల్సీగా ఆయన ఓటమికి నాకు తెలిసినంతవరకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొందరు సన్నిహితులే కారణం. కుటుంబంలో అంతా బాగున్నట్లు బయటకు కనిపించినా.. లోపల కోల్డ్‌వార్‌ ఉండేది’’ అని షర్మిల పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు