Noida: ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చిపెట్టిన భార్య

ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేసింది.

Published : 16 Jan 2023 06:52 IST

నోయిడా: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే నిర్మాణ దశలో ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేసింది. ఈ దారుణ ఘటన నోయిడా(Noida)లో చోటు చేసుకుంది. జనవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఉత్తర్‌ప్రదేశ్‌(UP)లోని బులంద్‌ శహర్‌కు చెందిన సతీష్‌ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం భార్య నీతూ, ఐదేళ్ల కుమారుడితో కలిసి కలిసి నొయిడాకు వచ్చేశాడు. స్థానిక సరస్వతి కుంజ్‌లో సొంతింటిని నిర్మించుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం తాపీ మేస్త్రీ హర్పాల్‌ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని రోజులు గడిచే సరికి సతీశ్‌ భార్యతో తాపీ మేస్త్రీకి అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రియుడిపై మోజుతో నీతూ తన భర్తను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి అతడిని హతమార్చేందుకు పథకం పన్నింది. జనవరి2న భర్త మద్యం మత్తులో ఉండడంతో ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరూ పక్కనే నిర్మాణ దశలో ఉన్న సెప్టింగ్‌ ట్యాంకులో శవాన్ని పూడ్చేసి ప్లాస్టరింగ్‌ చేసేశారు. అయితే, తన సోదరుడు కనిపించడం లేదంటూ సతీష్‌ సోదరుడు ఈ నెల 10 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు అనుమానం వచ్చి సతీష్‌ భార్యను ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడి కూపీ లాగారు. మృతుడి భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నోయిడా అదనపు డీసీపీ విశాల్‌ పాండే వెల్లడించారు. మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని