logo

పొలాల్లో రాళ్లు.. పోతున్న ప్రాణాలు..

జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే కంకరను తరలించే వాహనాలు రేయింబవళ్లు పదుల సంఖ్యలో పరిమితికి మించి లోడ్‌తో వెళ్తుండడంతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. టిప్పర్ల చోదకులు ఇష్టమొచ్చినట్లు వేగంగా వాహనాలు

Published : 21 Jan 2022 02:38 IST

క్వారీలతో జనం బెంబేలు
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

సిర్పూర్‌(టి) మండలం కర్జిపల్లి గ్రామం నుంచి రెండు నెలల కిందట కంకరను తీసుకెళుతున్న టిప్పర్‌

జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే కంకరను తరలించే వాహనాలు రేయింబవళ్లు పదుల సంఖ్యలో పరిమితికి మించి లోడ్‌తో వెళ్తుండడంతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. టిప్పర్ల చోదకులు ఇష్టమొచ్చినట్లు వేగంగా వాహనాలు నడుపుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కంకర క్వారీలో పేలుళ్ల కారణంగా భారీ రాళ్లు పంట చేలో వచ్చి పడడంతో దిగుబడి బాగా తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. క్వారీ తవ్వకాలతోపాటు, పరిమితికి మించి కంకరను తీసుకెళ్తున్న వాహనాలపై సంబంధిత అధికారులు నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

రహదారులన్నీ ఛిద్రమవుతున్నాయని, పరిమితికి మించి కంకర తీసుకెళ్లడంతో దుమ్ముతో సహవాసం చేస్తున్నామని సిర్పూర్‌(టి) మండలం ప్రజలు నెల కిందట లారీలను అడ్డుకున్నారు.

* కౌటాల మండలంలోని ముత్యంపేట శివారు ప్రాంతంలో నాలుగు కంకర క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చింతలమానేపల్లి మండలం గూడెం వంతెన మీదుగా మహారాష్ట్రకు, సిర్పూర్‌(టి), కాగజ్‌నగర్‌ మీదుగా ఆసిఫాబాద్‌కు నిత్యం కంకరను తరలిస్తున్నారు. పది, పన్నెండు చక్రాల లారీల్లో పరిమితికి మించి తీసుకెళ్లే క్రమంలో సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. భారీ గుంతలు పడ్డాయి. ఇక్కడ రహదారులకు సమీపంలోనే నివాసాలు ఉన్నందున దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో క్వారీల్లో పేలుళ్లు జరుపుతున్నారు. సమీప పంట చేలో భారీ రాళ్లు పడడంతోపాటు, పంటలను కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో రైతులు బిక్కుబిక్కుమంటూ కాపలా కాస్తున్నారు.


పంట మొత్తం ధ్వంసం - సంతోష్‌, ముత్యంపేట

నాకున్న రెండు ఎకరాల చేను పక్కనే క్వారీని ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో పేలుళ్ల కారణంగా భారీ రాళ్లు పంటలో పడుతున్నాయి. మొక్కలు వంగిపోయి నేలవాలుతున్నాయి. దిగుబడి బాగా తగ్గిపోతోంది. పంట తీసేశాక సైతం కొన్ని రోజులు చేను ఖాళీగా ఉన్న సమయంలో రాళ్లు పేరుకుపోతున్నాయి. వీటిని ట్రాక్టర్‌తో తీయిస్తున్నాం. క్వారీ నిర్వహకుల దృష్టికి తీసుకెళితే ఎలాంటి స్పందన ఉండట్లేదు.


* డిసెంబర్‌ 2021లో ముత్యంపేట గ్రామానికి చెందిన ఆదే కిష్టయ్య ఉదయం రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా, కంకరను తీసుకెళ్తున్న లారీ వచ్చి ఢీ కొట్డడంతో ఘటనాస్థలిలోనే మృతిచెందారు. గురువారం సైతం డోర్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు కంకర లారీ ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతిచెందారు. మరో యువకుడు గాయపడ్డారు. రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు చనిపోయారు.


తనిఖీ చేస్తాం
- నాగరాజు, ఏడీ, గనులశాఖ

నిబంధనల మేరకు క్వారీ తవ్వకాలు జరపడంతో పాటు, వాహన సామర్థ్యం మేరకే కంకరను తీసుకెళ్లేలా ఆర్టీఏ అధికారులతో కలిసి తనిఖీ చేస్తాం. పరిమితికి మించి కంకరను తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని