logo

మినీ ఆడిటోరియంపై చిగురిస్తున్న ఆశలు

ఆదిలాబాద్‌ పురపాలక సంఘ పరిధిలో మినీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. పట్టణంలోని కైలాస్‌నర్‌ కాలనీలో ఆడిటోరియం నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టారు.

Published : 05 Oct 2022 04:36 IST

రూ. 5 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కసరత్తు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం


ఆదిలాబాద్‌లోని మినీ ఆడిటోరియం కోసం ఎంపిక చేసిన స్థలంలో భవనాలు కూల్చివేసి చదును చేసి..

ఆదిలాబాద్‌ పురపాలక సంఘ పరిధిలో మినీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. పట్టణంలోని కైలాస్‌నర్‌ కాలనీలో ఆడిటోరియం నిర్మించేందుకు స్థల సేకరణ చేపట్టారు. ఇప్పటికే అక్కడున్న అధికారుల నివాస గృహాలు(వైట్‌ క్వార్టర్స్‌)ను కూల్చివేసి చదును చేశారు. చెట్లు ఉండటంతో వాటిని తొలగించేందుకు అనుమతులు తీసుకోనున్నారు. త్వరలోనే ఇక్కడ భవనం నిర్మించేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించేందుకు సౌలభ్యంగా ఉండే ఆడిటోరియం కావాలని చాలాకాలంగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో మరింత డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం సంఘ భవనాలు, ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఉంటే అందరికి ఉపయోగపడనుందనే అందరి వాదన. అధికారిక కార్యక్రమాలకు కూడా  ఇది ఉపయోగ పడనుంది. రిమ్స్‌లో ఆడిటోరియం ఉన్నా అది కళాశాలకే పరిమితమవుతోంది. ఇతర కార్యక్రమాలకు ఇచ్చేందుకు వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకనే అందరికి ఉపయోగడపేలా ప్రభుత్వ పరంగా భవనం ఉంటే తక్కువ ధరతోనూ ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించేందుకు సైతం వినియోగించుకునే అవకాశం ఉంది.

నాలుగేళ్ల కిందటే రూ.5 కోట్లు మంజూరు
ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రంలో మినీ ఆడిటోరియం నిర్మాణం కోసం ఎమ్మెల్యే జోగురామన్న మంత్రిగా ఉన్న సమయంలోనే రూ.5 కోట్లు మంజూరు చేయించారు. తొలుత శాంతినగర్‌లోని బాలుర డిగ్రీ కళాశాల వెనుకాల ఉన్న 4 ఎకరాల మైదానంలో నిర్మించేందుకు నిర్ణయించారు. టెండర్లను ఆహ్వానించారు. అక్కడ కళాశాలలో కొత్త కోర్సుల మంజూరు, భవిష్యత్తులో అటానమస్‌ విశ్వవిద్యాలయం మంజూరుకు అవకాశాలు ఉండటంతో కళాశాలకే స్థలం అవసరముంటుందని ‘ఈనాడు’లో కథనం రావడంతో పనులు ప్రారంభించక ముందే ఆపివేశారు.

1.25 ఎకరాల సేకరణ
ఊరి చివర కాకుండా పట్టణ నడిబొడ్డున నిర్మించాల్సి ఉండడంతో స్థల సేకరణ కష్టమైంది. అందుకనే ఇన్ని రోజులు జాప్యమవుతూ వచ్చింది. చివరకు కైలాస్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుకాల 1.25 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ అధికారులకు కేటాయించిన పాత నివాసాలు ఉండటంతో ఇటీవలే పుర అధికారులు వాటిని కూల్చివేసి చదునుచేశారు.

పాత టెండర్లు రద్దు : అరుణ్‌, పురపాలక, ఇంజినీర్‌

గతంలో మినీ ఆడిటోరియంకోసం టెండర్లు నిర్వహించాం. 6 నెలల్లోగా సంబంధిత గుత్తేదారుతో అగ్రిమెంట్‌ చేసుకొని స్థలం అప్పగించాల్సి ఉండగా అది జరగలేదు. నిబంధనల మేరకు ఆ టెండర్‌ రద్దు అయింది. కొత్త ధర మేరకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts