logo

ప్రగతి తక్కువ.. వెనుకబాటే ఎక్కువ..

తెలంగాణ రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇతర జిల్లాల కన్నా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడి ఉన్నాయి.

Published : 27 Jan 2023 05:45 IST

రాష్ట్ర గణాంకాలలో ఉమ్మడి జిల్లా స్థితి..
న్యూస్‌టుడే, రాంనగర్‌

తెలంగాణ రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇతర జిల్లాల కన్నా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే స్థూల ఉత్పత్తి తగ్గిపోగా, తలసరి ఆదాయంలో కొంత పెరుగుదల ఉంది. నీటి పారుదల సౌకర్యం మెరుగవ్వడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆరోగ్యశ్రీతోపాటు ఇతర వైద్య సౌకర్యాలను పొందడంలో కుమురం భీం జిల్లా అట్టడుగున ఉంది. జిల్లాలో విద్యుత్తు, విద్య, వైద్య రంగాలపై దృష్టి సారిస్తేనే జిల్లాలు ప్రగతి దిశగా పయనించే అవకాశం ఉంది. బుధవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంకాల సంకలనం- 2022లో వివిధ రంగాల్లో ఉమ్మడి జిల్లాల పరిస్థితిపై ప్రత్యేక కథనం.

వ్యవసాయంలో వృద్ధి

ఉమ్మడి జిల్లాలో నీటి పారుదల సౌకర్యం పెరగడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. పత్తి, సోయా తదితర పంటల సాగులో రాష్ట్రం మొత్తంలో ఆదిలాబాద్‌ రెండో స్థానంలో ఉండగా కుమురం భీం అయిదో స్థానంలో ఉంది. సోయా సాగులో ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిర్మల్‌ రెండో స్థానంలో ఉంది. ఆహార పంటల సాగు తగ్గి.. వాణిజ్య పంటల సాగు పెరిగింది.

వైద్య సేవల్లో అట్టడుగున..

ఉమ్మడి జిల్లాలో వైద్య సౌకర్యాల్లో వెనుకబడింది. ఆరోగ్యశ్రీలో కుమురం భీం అట్టడుగున ఉంది. జిల్లాలో కేవలం 1,212 మంది మాత్రమే సేవలను పొందడంతో రాష్టంలో చివరి స్థానంలో ఉంది. మంచిర్యాల జిల్లాలో 2,753 మంది ఆదిలాబాద్‌లో 3,170, నిర్మల్‌లో 3,529 మంది ఆరోగ్యశ్రీ సేవలను పొందారు. కేసీఆర్‌ కిట్లు పొందడంలోనూ కుమురంభీం జిల్లా చివరి స్థానంలో ఉంది. మంచిర్యాల 24, నిర్మల్‌ 20వ స్థానంలో ఉంది. పౌష్టికాహారం తీసుకోవడంలో నిర్మల్‌ జిల్లా మినహా ఇతర జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో పశు సంపద బాగా తగ్గిపోయింది. ఇతర జిల్లాలతో పోలిస్తే గొర్రెలు, మేకలు, పశువుల సంఖ్య తక్కువగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో పశువుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. పాలు, మాంసం ఉత్పత్తిలోనూ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.

అపార వనరులున్నా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పారిశ్రామిక రంగంలో అట్టడుగు స్థానంలో ఉంది. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మూతపడటంతో ఉపాధి తగ్గుతోంది. జిల్లాలో కొత్త పరిశ్రమలు రాలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో 134, మంచిర్యాలలో 74, నిర్మల్‌లో 64, కుమురం భీం జిల్లాలో కేవలం 24 పరిశ్రమలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఉన్నట్లుగా నివేదికలో పెర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మంచిర్యాల జిల్లాలో పట్టణంలో ఎక్కువ మంది నివసిస్తుండగా, కుమురంభీం జిల్లాలో అతి తక్కువగా పట్టణాల్లో నివాసం ఏర్పర్చుకున్నారు.  

అక్షరాస్యత విషయంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. జిల్లాల్లో అక్షరాస్యతను సాధించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో సర్వేను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో అక్షరాస్యత శాతం కొంత మెరుగ్గా ఉంది.

తలసరి ఆదాయం

ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ఆర్జించే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని బట్టి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. గతంతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నా ఇంకా మెరుగుపడాల్సి ఉంది.

స్థూల ఉత్పత్తి

జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) జిల్లాల వారీగా ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువ మేరకు గణిస్తారు. గతేడాదితో పోలిస్తే మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలు వెనుకబడి పోగా, ఆదిలాబాద్‌, కుమురంభీం జిల్లాల్లో స్వల్ప వృద్ధి కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని