logo

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ బదిలీ

జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ హనుమకొండకు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.

Published : 01 Feb 2023 04:11 IST

కొత్త పాలనాధికారి రాహుల్‌రాజ్‌ జిల్లావాసులకు పరిచితమే
ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే

జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ హనుమకొండకు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఆమె స్థానంలో కుమురం భీం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌రాజ్‌ ఇక్కడికి వస్తున్నారు.

మంగళవారం విద్యానగర్‌ పాఠశాలలో మన ఊరు మన బడి పనులు

తనిఖీ చేసి వెళుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

సమీక్షలతో తనదైన ముద్ర..

బదిలీపై వెళ్తున్న పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ 2020 జులై 17న అప్పటి పాలనాధికారి శ్రీదేవసేన నుంచి బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా రెండు సంవత్సరాల 4 నెలల 15 రోజులు పని చేశారు. కరోనాసమయంలో విధుల్లో చేరడంతో ఏడాదిపాటు ప్రజలతో మమేకం కాలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ సమీక్షలతో పనులు వేగవంతం చేసినా.. గాడితప్పిన అధికారులను, ఉద్యోగులను మందలించడంలో మెతక వైఖరి ప్రదర్శించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పల్లె ప్రగతి మొదలుకొని.. తాజాగా అమలవుతున్న ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం వరకూ రాష్ట్రస్థాయిలో మంచి పనితీరు కనబరిచారు. మాతాశిశు మరణాలను అరికట్టడంలో కొంతవరకు సఫలీకృతులయ్యారు. శాంతిభద్రతల విషయంలో జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో, దేశంలో అయిదో స్థానంలో నిలవడం సాధ్యమైంది. కరోనా వల్ల పాలనాప్రాంగణ ఆవరణలో జాతీయజెండా ఎగురవేసిన పాలనాధికారిగా ఘనత దక్కించుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు మినహా.. ప్రజల మన్ననలు పొందడంలో తనదైన ముద్ర వేయలేకపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. నూతన సంవత్సర వేళ పుష్పగుచ్ఛాలు బదులు పేదలకు ఉపయోగపడేలా నోటుపుస్తకాలు, దుప్పట్లు వంటివి తీసుకురావాలని పిలుపునిచ్చి అందరిలో స్ఫూర్తినింపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వేదికగా పాలనాధికారి తీరుపై అసహనం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల సమస్యల నివేదనకు వేదికైన ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించకపోవడం.. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు కూడా సంక్షేమ పథకాల అమలును పరిశీలించారే తప్ప ప్రజా అర్జీలను అంతగా పట్టించుకోలేదనే అపవాదును మూట్టగట్టుకున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనా సామాన్యులపై కబ్జా రాయుళ్లు జులుం ప్రదర్శించినా కఠినంగా వ్యహరించలేపోయారనే విమర్శలు ఉన్నాయి.


సాఫ్ట్‌వేర్‌ కొలువు నుంచి ఐఏఎస్‌గా..

పేరు : పీఎస్‌.రాహుల్‌రాజ్‌

స్వస్థలం : హైదరాబాద్‌

భార్య : శ్రీజ, కెనరాబ్యాంకు ఉద్యోగి

పిల్లలు : రితిక, నిర్విక

విద్యాభ్యాసం : హైదరాబాద్‌

విద్యార్హత : బీటెక్‌(2005-2009)

తొలి ఉద్యోగం : టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు

ఐఏఎస్‌గా ఎంపిక : 2015 బ్యాచ్‌, 375 ర్యాంకు

పోస్టింగ్‌లు : 2016లో నిజామాబాద్‌ సహాయ కలెక్టర్‌, 2017లో సహాయ కార్యదర్శి(కేంద్ర సర్వీసులో),  2018-20 జనవరి వరకు బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌,  2020 జనవరి నుంచి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనరు,  2020 నవంబర్‌ 9 నుంచి కుమురం భీం కలెక్టర్‌

అభిరుచులు : టీచింగ్‌, క్రికెట్ చూడటం, గార్డెనింగ్‌


రాహుల్‌ రాజముద్ర వేసేనా?

సిక్తా పట్నాయక్‌ 2021 జులై 7 నుంచి జూన్‌ 4 వరకు 59 రోజులు ప్రసూతి సెలవులో వెళ్లినపుడు రాహుల్‌ రాజ్‌ జిల్లాకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. కరోనా సమయం కావడంతో తనదైన ముద్ర వేయలేకపోయారు. ప్రజావాణి విభాగాన్ని పకడ్బందీగా నిర్వహించి, క్షేత్రస్థాయి పర్యటనలతో జిల్లాయంత్రాంగంలో జవాబుదారీతనం పెంచుతారని, రెవెన్యూ, వైద్య, విద్యావ్యవస్థలను గాడిపెడతారని ఇపుడు జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని, సామాన్యులకు అండగా నిలబడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని