logo

‘ఆహా’ చాకిరేవు..!

నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో అటవీ ప్రాంతంలో మారుమూలన ఉన్న చాకిరేవు గ్రామస్థుల తాగునీటి అవస్థలపై గత మార్చిలో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘చెలమ నీరే ఆధారం’ అన్న శీర్షికతో చిత్రవార్త ప్రచురితమైంది.

Published : 04 Feb 2023 04:28 IST

వారి ఇబ్బందులు బాహ్యప్రపంచానికి తెలిసెనిలా..

చాకిరేవు గ్రామం

పెంబి-మామడ, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో అటవీ ప్రాంతంలో మారుమూలన ఉన్న చాకిరేవు గ్రామస్థుల తాగునీటి అవస్థలపై గత మార్చిలో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘చెలమ నీరే ఆధారం’ అన్న శీర్షికతో చిత్రవార్త ప్రచురితమైంది. ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి కష్టాలు పడుతున్నారా జనాలు అని అందరూ ఆశ్చర్య పోయారు. ఆ తర్వాత ఆ గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం 72 కి.మీ. దూరంలోని జిల్లా పాలనా ప్రాంగణం వరకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడే వంటావార్పు చేసుకుంటూ నిరసన కొనసాగించారు. స్పందించిన అధికారులు ఆ ఊరిని సందర్శించారు. తాగునీరు, విద్యుత్తు, రహదారి సౌకర్యం కల్పించాలన్న గ్రామస్థుల డిమాండ్‌ మేరకు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని అప్పటి పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారూఖీ హామీ ఇచ్చారు. తక్షణం చేతిపంపు ద్వారా నీరు అందించే ఏర్పాటు చేశారు. గ్రామస్థుల నిరసన క్రమం, అధికారుల సందర్శన తదితర అంశాలపై వరుస కథనాలు రావడంతో చాకిరేవు అందరికీ సుపరిచితమైంది. అదంతా గడిచి పోయింది. అభివృద్ధి ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలపైకెక్కలేదు.

తాజాగా మళ్లీ వార్తల్లోకి..

ఉన్నట్టుండి శుక్రవారం చాకిరేవు గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఆ గ్రామస్థులు కనిపించారు. ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆ ఊరి ముఖచిత్రం, జీవన విధానం, సమస్యలతో సహజీవన దృశ్యాలు ప్రసారమయ్యాయి. నటులు బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ వారి సమస్యలపై మాట్లాడారు. గ్రామంలో సౌర దీపాలు ఇచ్చేందుకు ‘ఆహా’ యాజమాన్యం ముందుకొచ్చింది. గ్రామాభివృద్ధి కోసం ఆ కార్యక్రమ వేదికపై ఓ సంస్థ రూ.లక్ష చెక్కును చాకిరేవు గ్రామపెద్దలు లింబారావు, తొడసం శంభుకు అందించారు. మారుమూలన ఉన్న ఆదివాసీలు తమ ఇబ్బందులను తెలియ జేసేందుకు ఎంచుకున్న పాదయాత్ర, పాలనాప్రాంగణం ముందు చేపట్టిన నిరసనతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఓ పరిష్కార మార్గాన్ని చూపెట్టే దిశకు దగ్గరైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని