logo

ముఖ్యమంత్రి గారూ.. మా బతుకులు బేజారు..

నూతన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంతోపాటు పోడు పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం కేసీఆర్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  

Updated : 30 Jun 2023 06:37 IST

మా కష్టాలు తీర్చాలి సారూ..

ఈనాడు, ఆసిఫాబాద్‌ : నూతన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంతోపాటు పోడు పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం కేసీఆర్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగు, తాగునీటి ఇబ్బందులు.. అందని విద్య, వైద్యం, వానొస్తే అడుగు ముందుకు వేయలేని రహదారులు.. ఇలా సకల అసౌకర్యాలతో కునారిల్లుతున్న గిరిజనం.. తమ కష్టాలు తీర్చాలని, నిలిచిపోయిన ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు తగినన్ని కేటాయింపులు చేసి జిల్లాపై వరాల జల్లు కురిపించాలని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

జోడేఘాట్కు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ 2014లో తొలిసారి వచ్చారు. కుమురం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు, మ్యూజియం, స్మృతివనం ఏర్పాట్లకు రూ.25 కోట్లు మంజూరు చేశారు. మళ్లీ 2018 ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చారు. జోడేఘాట్‌ సభలో సీఎం అక్కడి గిరిజనులందరికీ ఇళ్లను మంజూరు చేశారు. వీటిని లబ్ధిదారులే నిర్మించుకున్నా పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు. వీటిని మంజూరు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.


నిధుల లేమితో అందని సాగు నీరు

కట్టకు పగుళ్లతో కుమురం భీం జలాశయం

జిల్లాలో నిండు వేసవిలోనూ రెండో పంటలకూ సాగునీరందించే ప్రాజెక్టులున్నాయి. కుమురం భీం, వట్టివాగు, చెలిమెల, పాల్వాయిసాగర్‌, జగన్నాథ్‌పూర్‌ మధ్య  తరహా జలాశయాలు, బొక్కివాగు, నంబాల, అర్కగూడ చిన్నతరహా ప్రాజెక్టులున్నాయి. అసంపూర్తి పనులతో కొన్ని, అస్తవ్యస్త కాలువలతో మరికొన్ని జలాశయాలు అన్నదాతలకు రిక్తహస్తాన్ని చూపుతున్నాయి. వీటన్నింటి పరిధిలో లక్షా 20 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కుమురం భీం ఆనకట్టకు పగుళ్లు వచ్చాయి. పది టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఆనకట్ట పగుళ్ల కారణంగా కేవలం ఐదు టీఎంసీల నీటిని మాత్రమే ఉంచుతున్నారు. 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. ఎడమ ప్రధాన కాలువ పలు చోట్ల సిమెంట్ లైనింగ్‌ కొట్టుకుపోయింది. కుడి కాలువ నిర్మాణం పూర్తి చేసుకుని మూడేళ్లు గడిచినా ఆరంభంలో కూలిపోవడంతో చుక్క నీరు ఇప్పటికీ వదలలేదు.


ఏళ్లుగా ప్రాజెక్టుల నిర్మాణం

నిర్మాణ దశను వీడని జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు

25 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన వట్టివాగు జలాశయం శిథిల కాలువలు, తూములతో వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తోంది. కాలువల ఆధునికీకరణకు రూ.70 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు. 15 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన జగన్నాథ్‌పూర్‌ జలాశయ పనులు 18 సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి. వెయ్యి ఎకరాల ఆయకట్టు కలిగిన నంబాల ఆనకట్ట నిర్మాణ దశను వీడటం లేదు. 11 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన పాల్వాయిసాగర్‌ ప్రాజెక్టు కాలువలు సాగు నీటి సరఫరాకు పనికి రాకుండా పోయాయి. బొక్కివాగు, అర్కగూడ జలాశయాలు సైతం కాలువల మరమ్మతులు లేకపోవడంతో అన్నదాతలకు కంటనీరు తప్పడం లేదు.


నిలిచిన 48 రహదారుల పనులు

అసంపూర్తిగా అంకుసాపూర్‌ వంతెన

జిల్లాలో అటవీ అనుమతులు లేక 48 రహదారుల పనులు నిలిచిపోయాయి. దశాబ్దాల నుంచి వంతెనల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గుండి, అంకుసాపూర్‌, లక్మాపూర్‌, వంతెనలు పుష్కరకాలం నుంచి పూర్తి కావడం లేదు. గతేడాది వర్షాలకు కూలిపోయిన అందవెల్లి వంతెన మరమ్మతులు ఈ వర్షాకాలంలోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. సీఎం స్వయంగా నిధులు మంజూరు చేసినా హట్టి నుంచి జోడేఘాట్ వరకు 22 కిలోమీటర్ల రహదారి 8 కిలోమీటర్ల మేర అటవీ అనుమతులు లేవనే కారణంతో నేటికీ పనులు చేయలేదు. 318 గ్రామాలకు కనీస రహదారులు లేవు.


వెక్కిరిస్తున్న వైద్యుల ఖాళీలు

వైద్యులు లేని రొంపల్లి పీహెచ్‌సీ(ఇక్కడి వైద్యుడిని ఆసిఫాబాద్‌కు డిప్యూటేషన్‌పై ఇచ్చారు)

ఈ సంవత్సరం నుంచి జిల్లాలోని వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. పట్టణ కేంద్రాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపడుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగా ఉన్నాయి. జిల్లాలో 22 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పీహెచ్‌సీలను డిప్యూటేషన్‌పై వైద్యాధికారులతో నెట్టుకొస్తున్నారు. వైద్యుల నియామకంతోపాటు, సాంకేతిక విద్యకు పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.


పరిశ్రమల ఏర్పాటుతో ప్రయోజనం

జిల్లాలో రెండు లక్షల ఎకరాలకుపైగా పత్తి పంటను పండిస్తారు. పంటలో దాదాపు 50 శాతం మహారాష్ట్రకు వెళ్లిపోతుంది. ఈ ప్రాంతంలోనే ఆహారశుద్ధి యూనిట్లు, రైస్‌, దాల్‌ మిల్లుల ఏర్పాటు, పత్తి సంబంధిత పరిశ్రమలైన స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిల్లుల ప్రారంభానికి తోడ్పాటు అందించాలి. దేశంలో అరుదుగా లభ్యమయ్యే వైటక్లే(తెల్లసుద్ద), లైమ్‌స్టోన్‌ గనులు జిల్లాలో ఉన్నాయి. సిరామిక్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని