logo

Telangana Elections: ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోవడమంటే ఏంటో తెలుసా?

‘ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా తిరిగి రావు.’ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తరచూ చేస్తున్న వ్యాఖ్యలివి.

Updated : 03 Nov 2023 08:29 IST

అది దక్కితేనే అభ్యర్థులకు గౌరవప్రద ఓటమి

ఆదిలాబాద్‌ అర్బన్‌, లక్షెట్టిపేట న్యూస్‌టుడే: ‘ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా తిరిగి రావు.’ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తరచూ చేస్తున్న వ్యాఖ్యలివి. ఫలితాలు వెలువడిన అనంతరం అభ్యర్థులకు తమ ధరావతు డబ్బులు తిరిగి వస్తే అది గౌరవప్రదమైన ఓటమిగా భావిస్తారు. ఆ డబ్బులు తిరిగి రాకపోతే అభ్యర్థి చిత్తుగా ఓడిపోయినట్లే. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 1569 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 252 మంది తమ ధరావతును తిరిగి పొందారు. నేటినుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో అసలు ధరావతు అంటే ఏమిటి? అభ్యర్థులు డబ్బులను రిటర్నింగ్‌ అధికారి వద్ద ఎందుకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.

నామపత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థుల వ్యక్తిగత వివరాల పరిశీలన, ధ్రువీకరణ, ఈవీఎంలపై గుర్తుల కేటాయింపు, సర్వీస్‌ ఓటర్లకు బ్యాలెట్‌ పేపర్లపై గుర్తులను ముద్రించడం వంటి ప్రతి అంశంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన ప్రచార ఖర్చులు, ప్రతి కదలికపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందాలు నిశిత పరిశీలన చేస్తాయి. అభ్యర్థులు ఏదో తమాషాకు పోటీ చేస్తే ఎన్నికల సంఘానికి అనవసర ఖర్చు పెరగడంతోపాటు అధికారుల విలువైన సమయం వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థుల నుంచి షరతులతో కూడిన తిరిగిచెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను స్వీకరిస్తోంది.


ఆర్‌ఓ వద్ద..

ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికలకు రూ.10 వేలు ధరావతు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం అందులో సగం(రూ.5 వేలు) చెల్లిస్తే సరిపోతుంది. నామపత్రం దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ) వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేస్తారు. ఆర్‌ఓ ఆ మొత్తాన్ని ఖజానా శాఖలో తెరచిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు.


ఆరోవంతు ఓట్లు సాధిస్తేనే..

ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధించాల్సి ఉంటుంది. అంటే 16 శాతానికి పైగా ఓట్లు వస్తేనే అభ్యర్థికి ఫలితాలు వెలువడిన అనంతరం రిటర్నింగ్‌ అధికారి ధరావతును తిరిగి ఇస్తారు. లేనిపక్షంలో ఆ డబ్బులను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది.


ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో 107 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 80 మంది ధరావతు కోల్పోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 123 మంది పోటీ పడితే 100 మంది అభ్యర్థులకు డిపాజిట్లు తిరిగి రాలేదు. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా డిపాజిట్లను కోల్పోవడం సర్వసాధారణం. అయితే గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సైతం ధరావతును కోల్పోయే తీర్పును ఇవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని