logo

విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?

ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Updated : 18 Apr 2024 05:36 IST

కనీస హాజరు 75 నుంచి 55 శాతానికి తగ్గింపు
అయినా మరో 44 మంది పరీక్షలకు దూరం

బాసర ఆర్జీయూకేటీ

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు కావాల్సిన వసతులు కరవవుతున్నాయి. సంరక్షణ సైతం నామమాత్రంగా మారింది. ఫలితంగా నిఘా కొరవడుతోంది. హాజరు శాతం నిబంధ]న కారణంగా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ మసకబారుతోందనే వాదనలు పెరుగుతున్నాయి.

ఎందుకు నిర్లక్ష్యం

ఆర్జీయూకేటీలో చేరిన విద్యార్థులందరూ విద్యా సంవత్సరం మొత్తం వసతిగృహంలోనే ఉండాలి. బయటకు వెళ్లాలంటే విశ్వవిద్యాలయం అధికారుల అనుమతి తప్పనిసరి. అంత పకడ్బందీగా వ్యవస్థ ఉన్నా విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోంది. పరీక్ష రాయడానికి కనీస అర్హత అయిన 75 శాతం హాజరు నమోదు కావడం లేదు. వసతి గృహంలోనే ఉన్నా తరగతులకు హాజరు కాకపోవడం, అనారోగ్యానికి గురికావడం, సెలవులకు ఇళ్లకు వెళ్లి ఆలస్యంగా కళాశాలకు రావడం, తదితర కారణాలతో విద్యార్థుల హాజరుశాతం తగ్గుతోంది. విద్యార్థులు తరగతులకు వస్తున్నారా వసతి గృహంలోనే ఎందుకు ఉంటున్నారనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. బాలుర వసతి గృహాల్లో పరిశీలకులుగా విశ్రాంత సైనికోద్యోగులను నియమించారు. వారు వసతి గృహాలు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులపై దృష్టి సారించాలి. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడాలి. వారు మానసికంగా ఆందోళనకు గురైనా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవసరమైతే విశ్వవిద్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఇవేమీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సెమిస్టర్‌ విధానంలో కాకుండా వార్షిక విధానంలో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు తరగతులపై దృష్టి సారించడం లేదు. పరీక్షలకు చివరి నెల, రెండునెలలు చదివి ఉత్తీర్ణత సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. తరగతులకు వెళ్లకుండానే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని కొందరు భావిస్తున్నారు. కానీ హాజరుశాతం తక్కువగా ఉంటే ఆ అవకాశం ఉండదు. ఫలితంగా పైతరగతులకు వెళ్లకుండా అదే తరగతి పరీక్షలు రాయాలి. కొందరు విద్యార్థులు జూనియర్లతో కలిసి తరగతులకు తరగతులకు హాజరు కావడం అవమానంగా భావిస్తున్నారు.

నిబంధనలు సడలించినా..

పీయూసీ01, పీయూసీ 02 విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయాలంటే కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కానీ 90 మంది విద్యార్థుల హాజరు 65 శాతమే ఉంది. నిబంధనల ప్రకారం వారు పరీక్షలకు అర్హులు కారు. కానీ రెండు రోజుల క్రితం కమిటీ సభ్యులు సమావేశమై కనీస హాజరును 55 శాతానికి తగ్గించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధన ఎప్పుడు సడలించారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనే విషయం చెప్పడం లేదు.  సడలించిన నిబంధనల ప్రకారం 46 మంది విద్యార్థులు అర్హత సాధించారని, మిగిలిన 44 మంది పరీక్షలకు అర్హత కోల్పోయారని ఓ అధికారి వెల్లడించారు. ఈ విషయం విద్యార్థులకు ఎప్పుడు సమాచారం అందించారని అడిగితే రెండు రోజుల క్రితం ప్రకటించామని చెబుతున్నారు. హాజరు శాతం తక్కువ ఉందని మంగళవారమే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా.. ఆయన మృతితో నిబంధన సడలించారా అని ప్రశ్నిస్తే అంతకంటే ఒక రోజు ముందే ప్రకటించామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని