logo

దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు

జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి.

Published : 26 Apr 2024 03:07 IST

మరమ్మతులకు వచ్చిన నియంత్రికలు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం : జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. పంటలకు చివరి దశలో నీరు అవసరం ఉండటంతోపాటు, గృహావసరాలకు కూడా ఇదే సమయంలో విద్యుత్తు అవసరం పెరగడంతో వినియోగం భారీగా పెరిగింది. కోటా కంటే వినియోగం అధికం కావడంతో లోవోల్టేజీ, ఇతర సమస్యలతో సరఫరాలో అంతరాయంతో పాటు నియంత్రికలు కాలిపోతున్నాయి.

జిల్లాలో 30 వేల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. యాసంగి సాగు ఎక్కువగా బోర్లు, బావులపైనే ఉంటుంది. నియంత్రికలపై భారం ఎక్కువగా ఉండటంతో తరచూ కాలిపోతున్నాయి. ప్రస్తుతం పంట ఉత్పత్తులు చేతికి రావడంతో సాగు నీటి వినియోగం తగ్గిపోయింది. భూగర్భజలాలు లేకపోవడంతో చాలా మంది రైతులు వేసవి పంటల జోలికి వెళ్లలేదు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లల్లో విద్యుత్తు వినియోగం పెరిగింది. జిల్లా మొత్తంలో 9,411 నియంత్రికలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి నెల 50 నుంచి 60 నియంత్రికలు మరమ్మతులకు వస్తున్నాయి. నియంత్రికను రైతులకు అందించిన తరువాత ఆరు నెలల వరకు తిరిగి మరమ్మతుకు రాకుండా ఉంటుంది. కానీ కొన్ని నియంత్రికలు తీసుకెళ్లిన తర్వాత కొద్ది నెలలకే కాలిపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.

పెరుగుతున్న వినియోగం

గతేడాది కంటే ఎండలు ఎక్కువగా ఉండటంతోపాటు, భూగర్భజలాలు అడుగంటి విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. ఇళ్లల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, కోతలు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో విద్యుత్తుపై భరోసాతో యాసంగి సాగు పెరిగింది. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చేయడం, పైగా పంటల సాగుపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో నీటి సౌకర్యం ఉన్న రైతులు పంటలు సాగు చేయడంతో వినియోగం పెరిగింది. రాబోయే నెలల్లో వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ సీజన్‌ కంటే ముందు నెల వారీగా 40 మిలియన్‌ యూనిట్ల లోపు ఉన్న విద్యుత్తు వినియోగం 50 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది.

లోతులో నీళ్లు

జిల్లాలోని కొన్ని మండలాల్లో భూగర్భజలాలు లోతుకు వెళ్లిపోయాయి. జలాశయాలు అడుగంటిపోవడంతో తాగు నీటికి సమస్య ఏర్పడుతోంది. భూగర్భ జల శాఖ అంచనాల మేరకు 10 మీటర్ల లోతులో నాలుగు మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ఇచ్చోడ మండలంలో ఫిబ్రవరి నెలలో 9.05 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంటే మార్చి నెలలో ఏకంగా 32 మీటర్ల లోతుకు పడిపోయాయి. గాదిగూడలో మార్చి నెలలో 17.80 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. జైనథ్‌లో 14.30 మీటర్లు, ఇంద్రవెల్లిలో 12.35 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయినట్లుగా భూగర్భజలశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు