logo

ఆత్మీయ సమ్మేళనాలకే ప్రాధాన్యం

ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు.

Updated : 01 May 2024 05:44 IST

 అన్ని వర్గాల ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం

నిర్మల్‌, న్యూస్‌టుడే: ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం చేస్తారు. అదే లోక్‌సభ ఎన్నికల్లో.. పైగా ఎండలు మండిపోతున్న తరుణంలో ఓటర్లందరినీ కలవడం కత్తి మీద సామే. ఈ క్రమంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. పట్టణాలు, గ్రామాల్లోని మత పెద్దలు, సామాజిక వర్గాలు, యువజన సంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో తమ పార్టీ చేసిన పనులు, గెలిపిస్తే ఏం చేయాలనుకున్నామో వివరిస్తున్నారు. అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు హాజరవుతున్నారు. తెల్లవారుజామున వాకర్లతో మాటామంతితో మొదలయ్యే ఈ సమావేశాలు.. రాత్రి వేళ కాలనీల్లో అందరినీ కలిసేవరకు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాల ఓట్లు ఆకర్షించడమే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గ ఓటర్లే గెలుపు ఓటములు శాసించేస్థాయి ఉండటంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారి ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు చేయడంలో నిమగ్నమయ్యారు.

మద్దతు కోసం ప్రయత్నాలు

ఎన్నికల వేళ చోటా నాయకులే అభ్యర్థులకు అండగా ఉంటున్నారు. బూత్‌స్థాయిలో ఎవరికి ఓటేయగలరో చెప్పే వీరంతా ఓటరు జాబితా పట్టుకున్న టిక్కులు పెడుతున్నారు. అలా టిక్కులు పెట్టి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఆయా వర్గాల మద్దతు కూడగడుతున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా పార్టీల అభ్యర్థులకు సమాచారం ఇచ్చి వారు హాజరయ్యేలా చూస్తున్నారు. ఇలా వందలాది మంది ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపైనే దృష్టి సారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితా వెల్లడి కావడంతో ప్రధాన పార్టీలు ప్రచార పర్వం జోరు పెంచారు. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో అంతటా రాజకీయ వే‘ఢీ’ మొదలైంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కలిసిన వారిని పలకరిస్తూ మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. భాజపా అభ్యర్థి గోడం నగేశ్‌, భారాస అభ్యర్థి ఆత్ర సక్కు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ మంగళవారం నిర్మల్‌ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని