logo

ఏసీబీ, విజిలెన్స్‌ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!

సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Published : 01 May 2024 06:59 IST

వాంకిడి వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్న ఫంక్షన్‌ హాల్‌

ఈనాడు, ఆసిఫాబాద్‌ : సర్కారీ స్థలాల కబ్జా, అక్రమ వెంచర్లతో చెలరేగుతున్న భూ మాఫియా వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏకకాలంలో విజిలెన్స్‌, ఏసీబీ అధికారుల తనిఖీలతో వీరు ఠారెత్తిపోతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లూ అధికారులు, నేతల అండదండలతో ఏం చేసినా నడుస్తుందనే ధీమాతో ఉన్న వీరు.. తాజాగా పరిస్థితులు మారడంతో కొందరు నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా.. భూ క్రయ విక్రయాలతో రూ.కోట్లు దండుకున్న ఈ ముఠా సభ్యులపై విచారణ సజావుగా సాగుతుందా, అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయా అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మాజీ సర్పంచి, ఇద్దరు మైనారిటీ నేతలు, మరో ఇద్దరు కీలక నాయకులు కలిసి బృందంగా ఏర్పడ్డారు. బీడీపీపీ భూములు, ఆబాదీ భూములను పట్టాదారుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల పడావుగా ఉన్న వాటిని మైదానాలుగా మార్చి ప్లాట్లు విక్రయించేస్తున్నారు. ఈ తరుణంలో అధికారులందరికీ చేతులు తడిపి, తమ పని కానిచ్చేశారు. ఈ అక్రమాలను ‘ఈనాడు’ వరుస కథనాలతో బహిర్గతం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్‌ అధికారుల విచారణ కొనసాగుతోంది. సదరు భూబకాసురులు తమ కార్యకలాపాలను వాంకిడికి సైతం విస్తరించారు. రెండు రోజుల కిందట విజిలెన్స్‌ అధికారులు వాంకిడి మండలంలో వీరు చేసిన భూ అక్రమాల వివరాలను రెవెన్యూ కార్యాలయం నుంచి తీసుకున్నారని సమాచారం.

కొనసాగుతున్న విచారణ...

నాలుగు వరుసల రహదారి పరిహారం విషయంలో జరిగిన అక్రమ చెల్లింపులపై ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. అయాచితంగా లబ్ధిపొందిన వ్యక్తులు, తమకు సహకరించిన రెవెన్యూ అధికారుల ఖాతాల్లో రూ.కోటి వరకు జమ చేసిన విషయం విదితమే. రెబ్బెన, ఆసిఫాబాద్‌, వాంకిడి మండలాల్లో ఇప్పటి వరకు భూములు కోల్పోయిన వారికి రూ.70 కోట్లు పరిహారంగా ఇచ్చారు. ఆసిఫాబాద్‌లో రూ.4 కోట్ల పరిహారం కుంభకోణం ఉండగా.. మిగతా చోట్ల సైతం చెల్లింపుల్లో అనేక అవకతకవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి పరిహారం చెల్లింపుపై సమగ్ర విచారణ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భూ సమస్యను ఆర్డీఓ కార్యాలయంలో 60:40 శాతంగా ఎలా పరిష్కరిస్తారు? మిగతా భూములను ఎందుకు సర్వే చేసి, పోజిషన్‌ రైతులకు చూపించలేదు. కేవలం రహదారుల పక్కనే ఉన్న భూములను మాత్రమే తీసుకుని, పట్టా పాస్‌ పుస్తకాలు ఎలా జారీ చేస్తారు (ఇటీవల పట్టాలు ఇతరుల పేరు మీద వచ్చాయి). వెంచర్‌కు అనుమతులు ఉన్నాయా, తదితర విషయాలను విజిలెన్స్‌ అధికారులు సేకరిస్తున్నారు.

వాంకిడిలో ఏం జరిగింది...

నిజాం కాలంలో వాంకిడి (కలామ్‌) కు చెందిన లతీఫొద్దీన్‌కు 12 వివిధ సర్వే నంబర్లలో 104 ఎకరాల భూమి ఉండేది. కాలక్రమేణా ఆయన ఇతర దేశాల్లో స్థిరపడి అక్కడే మృతి చెందారు. ఈ భూములను తాతల కాలం నుంచి స్థానిక రైతులు సాగు చేసుకుంటున్నారు. భూములన్నీ పట్టేదార్‌ పేరుమీద ఉండడంతో.. వారి వారసులను స్థిరాస్తి వ్యాపారి, మరో ఇద్దరు రంగంలోకి దించారు. ఆసిఫాబాద్‌ ఆర్డీఓ వద్దకు ఈ సమస్య వెళ్లగా.. ఆయన 60:40 శాతంగా భూములను పట్టేదారు, కాస్తు చేస్తున్న యజమానులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో స్థిరాస్తి, వ్యాపారి స్థానిక రాజకీయ నేత వాంకిడి సమీపంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలను రెండు ఎకరాల చొప్పున 60:40 ఒప్పందంలో భాగంగా తీసుకున్నారు. మిగతా భూములను సర్వే చేయలేదు. స్థిరాస్తి వ్యాపారి ఈ భూమిని మరో నేతకు విక్రయించడంతో అక్కడ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం జరుగుతోంది. 59 సర్వే నంబర్‌లో సైతం వెంచర్‌ వేసేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని