logo

అడుగడుగునా అపూర్వ స్వాగతం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.. తొలిసారిగా అనకాపల్లి జిల్లాలో ఆదివారం అడుగుపెట్టిన బూడి ముత్యాలనాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది. దారి పొడువునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి...

Published : 18 Apr 2022 02:02 IST

జిల్లాలో ఉప ముఖ్యమంత్రికి అభినందనల వెల్లువ 

పాయకరావుపేట, అనకాపల్లి పట్టణం, దేవరాపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.. తొలిసారిగా అనకాపల్లి జిల్లాలో ఆదివారం అడుగుపెట్టిన బూడి ముత్యాలనాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది. దారి పొడువునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో ఆయనకు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాయకరావుపేటలో ఘనస్వాగతం పలికారు. నర్సీపట్నం రోడ్డు కూడలి వద్ద ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. వైకూడలిలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు గజమాలతో సత్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవిసుభాష్‌ పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ముత్యాలనాయుడు కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, నాయకులు సూరిబాబు, శ్రీనివాసరావు, బాబూరావు, సాయిబాబా, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి కశింకోట మీదుగా అనకాపల్లి చేరుకున్నారు. కొత్తూరు కళాశాల కూడలిలో రాష్ట్ర గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో మునగపాక నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ డాక్టర్‌ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ తదితరులు ఉప ముఖ్యమంత్రితోపాటు వాహనంలో ప్రయాణించారు. వెంకన్నపాలెం, చౌడువాడ, కె.కోటపాడు, మేడిచర్ల, కొత్తపెంట, వేచలం, మామిడిపల్లి మీదుగా స్వగ్రామం తారువకు ముత్యాలనాయుడు చేరుకున్నారు. మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా జనం తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని