logo

మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం

కొండకొప్పాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్‌ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు.

Published : 20 Apr 2024 02:02 IST

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కొండకొప్పాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్‌ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్కూల్లో నాడు-నేడు పనులకు తీసువచ్చిన ఇనుప ఊచతో పాఠశాల ఆవరణలో ఉన్న మునగచెట్టుపై కాడలను తెంపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్తు హెటెన్షన్‌ తీగలకు ఈ ఊచ తగలడంతో హేమంత్‌ చేతులు, కాళ్లు కాలిపోయి పడిపోయాడు. అక్కడే ఉన్న తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో హేమంత్‌ను ఆటోలో హుటాహుటిన అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఒక పక్క ఎండవేడి, మరో పక్క కాలిన గాయాలతో ఆ విద్యార్థి గగ్గోలు పెట్టాడు. ఇదే పాఠశాలలో ఎస్‌ఎస్‌ఏ విభాగానికి చెందిన ఉపాధ్యాయిని విద్యార్థికి మునగకాడలు కోసే పని అప్పగించిన తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయిని వి.ఎస్‌.సుమణి మాత్రం పాఠశాల విరామ సమయంలో ఇనుప ఊచ పొరపాటున విద్యుత్తు తీగలకు తగలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకొస్తున్నారని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. హెచ్‌ఎం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని హేమంత్‌కు మెరుగైన వైద్యం అందించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని