logo

జగన్‌ పాలన.. జ్వరాల విజృంభణ!

మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది.

Published : 25 Apr 2024 02:30 IST

మలేరియా నివారణ దినం నేడు

పాడేరు మండలంలో పిచికారీ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయ సునీత

పాడేరు పట్టణం, కొయ్యూరు, న్యూస్‌టుడే: మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. ఏజెన్సీలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా మలేరియా తగ్గుముఖం పట్టే ప్రసక్తి లేదని, తగ్గినట్లు కనిపించినా ప్రతి నాలుగేళ్లకోసారి విజృంభిస్తుందని నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఇది వైద్య, ఆరోగ్యశాఖకు తెలిసినా నిధులు లేవని, కేసులు తగ్గాయని, అసలు మరణాలే లేవంటూ తప్పుడు నివేదికలతో ఏళ్ల తరబడి కాలక్షేపం చేసింది. ఎన్నికల సమయంలో ప్రజా వ్యతిరేకత రాకుండా మొక్కుబడిగా దోమల నివారణకు పిచికారీ పనులు మొదలు పెట్టడం గమనార్హం. గురువారం మలేరియా నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.

  • మలేరియా వ్యాప్తి చెందేందుకు గిరిజన ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు అనుకూలమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • దోమల నివారణ చర్యలు చేపట్టడంతోపాటు మలేరియా మందులు, ఇతర సామగ్రి సమకూర్చాల్సిన అధికార యంత్రాంగం 2021 నుంచి వీటిని పట్టించుకోలేదు. దోమ తెరల పంపిణీ నిలిపివేసింది. ఏటా వేసవి ప్రారంభానికి ముందే వ్యాధి వ్యాప్తి కాకుండా చైతన్య సదస్సులు, ర్యాలీలు నిర్వహించేవారు. ప్రతి గ్రామంలో రెండు విడతల్లో పిచికారీ పనులు చేయించేవారు. ఆ తర్వాత హైరిస్కు గ్రామాల్లో మాత్రమే మందు పిచికారీ చేస్తున్నామని చెబుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ప్రక్రియ సైతం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు.
  • ఏటా మలేరియా నివారణ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు రూ.రెండు కోట్ల వరకూ ఖర్చవుతోంది. బడ్జెట్‌ లేదంటూ కేసులు నమోదు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. పిచికారీ పనులకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఖర్చవుతోంది. మందుల కొనుగోలు, ప్రచారం, దోమ తెరల పంపిణీ వంటి కార్యక్రమాలకు మరో రూ.కోటిన్నర వరకూ ఖర్చు అవుతుంది. పాడేరులో ఉన్న మలేరియా కార్యాలయం సైతం నామమాత్రంగా కొనసాగుతోంది. ఇక్కడి సిబ్బంది వేర్వేరు విభాగాల్లో డిప్యుటేషన్లతో మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

కేసులు ఉన్నా... మరణాలు లేవట!

పాడేరు డివిజన్‌లో 2017-18లో 2252 కేసులు నమోదు కాగా.. 2018-19లో 1121, 2019-20లో 586, 2022-23లో 3711, 2024 ఏప్రిల్‌ నాటికి 546 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత పదకొండు ఏళ్ల నుంచి మలేరియా మరణం అధికారికంగా ఒక్కటీ కూడా నమోదు చేయలేదు. మలేరియా లక్షణాలతో చనిపోయినా వైరల్‌, టైఫాయిడ్‌ జ్వరంగా వైద్యారోగ్యశాఖ నమోదు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని