logo

కొత్తగా 30 వేల మందికి పింఛన్లు

‘జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల బోనస్‌ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి.

Published : 05 May 2024 01:36 IST

గిరిజన యువతకు స్థానికంగానే ఉద్యోగాలు
నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటన
గిరి గ్రామాల్లో పూరిస్థాయిలో రహదారులు.. తాగునీరు
‘న్యూస్‌టుడే’తో కూటమి అభ్యర్థి శిరీషాదేవి

‘జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 ఏళ్ల వయస్సుండే ప్రతి గిరిజనుడికి జులై నుంచి రూ.నాలుగు వేల పింఛను అందుతుంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల బోనస్‌ రూ. మూడు వేలు అదనం. ఈ నిర్ణయంతో రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటికే 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. వయస్సు తగ్గింపుతో సుమారు 30 వేల మందికి అదనంగా పింఛన్లు అందనున్నాయి. ఇక ప్రత్యేక డీఎస్సీ ప్రకటనతో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అయిదేళ్లుగా గిరిజన యువతకు ఉద్యోగాలే లేవు. ఇక గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగులకే.  గడచిన ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత అభివృద్ధి కుంటుపడింది. ఆదివాసీలకు రక్షణగా ఉండే చట్టాలను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వీటన్నింటిని సరిచేస్తాం. మొత్తంగా నియోజకవర్గంలో సంక్షేమం.. అభివృద్ధి రెండింటిని సమతూకంలో ఉండేలా చూస్తాను’ అని రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి స్పష్టం చేశారు. ‘న్యూస్‌టుడే’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే...

రంపచోడవరం, న్యూస్‌టుడే:

యువతలో వృత్తి నైపుణ్యం పెంపు.. ఉపాధి అవకాశాలు

తెదేపా పాలనలో  నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధిని చూపించేందుకు మండల కేంద్రాల్లోయూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. యువతకు శిక్షణ ఊసేలేదు. ఫలితంగా గడచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో యువత పూర్తిగా ఉపాధిని కోల్పోయారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుంది. ప్రత్యేక డీఎస్సీని ప్రకటించడంతో పాటు ఉద్యోగ, ఉపాధికి చర్యలు తీసుకొంటాం. ముఖ్యంగా నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆదివాసీ చట్టాలు పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా జీవో నంబరు మూడు పునరుద్ధరించి స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడతాం.

పింఛన్లతో సామాజిక భద్రత

నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ పింఛన్లను మంజూరు చేయించి సామాజిక భద్రతను కల్పిస్తాం. జగన్‌ ప్రభుత్వం ఐదెకరాల భూమి, కారు, పక్కా భవనం, విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్నాయని ఇలా ఏదో వంకతో వేలాది పింఛన్లు రద్దు చేశారు. దీంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. తెదేపా అధికారం చేపట్టిన వెంటనే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రతి నెలా రూ.4 వేలు పింఛన్లు అందిస్తాం.

గిరిజనులకు ఉచిత విద్యుత్తు

మన్యంలో 2014 నుంచి 2019వరకు తెదేపా హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా అయ్యేది. తెల్లరేషన్‌ కార్డున్న గిరిజన కుటుంబాలకు రాయితీపై విద్యుత్తును అందించాం. జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. తెదేపా అధికారం చేపట్టిన వెంటనే అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్తు పునరుద్ధరిస్తాం.

కట్టెల పొయ్యిల ఇబ్బందులుండవు..

మన్యంలో గిరిజన మహిళలు ఎక్కువగా కట్టెపొయ్యిలు వినియోగిస్తారు. తద్వారా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక మన్యంలో కట్టెపొయ్యిల అవస్థలుండవు. సిలెండర్లు ఉచితంగా ఇస్తే ఆర్థికంగా వారికి ఎంతో లాభం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18ఏళ్లు వయస్సు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చెల్లిస్తారు. ఎంతమంది పిల్లలున్నా చదువుకు సాయం చేస్తారు.

నిర్వాసితులకు పరిహారం.. పునరావాసం..

పోలవరం నిర్వాసితుల సమస్యను ప్రత్యేకంగా తీసుకుంటాం. తెదేపా హయాంలోనే వీరికి పునరావాస కాలనీలు నిర్మించాం. వైకాపా ప్రభుత్వం ఒక్క ఇల్లు నిర్మించలేదు. పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక జిల్లాకు ఇప్పటికే చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తద్వారా నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో స్థానికంగానే పరిష్కారమవుతాయి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సాయం అందుతుంది.

వ్యవసాయానికి ప్రోత్సాహం

1983లో తెదేపా ఆవిర్బవించిన తర్వాత దివంగత నేత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో రంపచోడవరం మన్యంలో పర్యటించారు. గిరిజనులు ఆర్థికంగా ఎదగాలంటే జీడిమామిడి తోటలు వేయాలని ప్రోత్సహించారు. దీంతో వేలాది ఎకరాలు జీడిమామిడి తోటలు వేశారు. జీడిమామిడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించి జీసీసీ ద్వారా కొనుగోలు చేసేందుకు తెదేపా చర్యలు చేపట్టింది. దీంతో గిరిజనులు ఆర్థికంగా ఎదిగారు. వైకాపా అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక పంటల సాగుకు నూరు శాతం రాయితీపై విత్తనాలు అందించడంతోపాటు వ్యవసాయ పెట్టుబడి కింద రుణాలు అందిస్తాం.

ఎస్సీ, బీసీల సంక్షేమానికి కృషి

గతంలో ఎస్టీలకు స్వయం ఉపాధి పొందేందుకు ట్రైకార్‌ పథకం ద్వారా 100 శాతం రాయితీపై వివిధ యూనిట్లు మంజూరు చేసేవారు. 2019లో అధికారం చేపట్టిన జగన్‌ ట్రైకార్‌ పథకాన్ని రద్దు చేశారు. తెదేపా పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద ప్రత్యేక నిధులు విడుదల చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు. జగన్‌ సబ్‌ప్లాన్‌ నిధులకు గండికొట్టి తూట్లు పొడిచారు. తెదేపా అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమం మెరుగుపర్చడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను పునరుద్ధరించి రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధిని చూపిస్తాం.

తాగునీటి ఇబ్బందులు తొలగిస్తాం

తెదేపా పాలనలో నియోజకవర్గంలో తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. భూపతిపాలెం జలాశయం నుంచి 21 గిరిజన గ్రామాలకు రక్షిత నీటిని అందించేందుకు రూ.10 కోట్లతో 2014లో గాంధీనగరంలో తాగునీటి పథకం ఏర్పాటు చేశాం. రహదారి లేని గ్రామాల్లో సైతం సోలార్‌ విద్యుత్తు సదుపాయంతో తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి 20 లీటర్ల నీటిని రూ.అయిదుకే అందించేవారు. 2019లో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం వాటర్‌ప్లాంట్‌ల నిర్వహణను గాలికొదిలింది. మారేడుమిల్లి మండలం కుట్రవాడ పాములేరు వాగు నుంచి వందలాది గ్రామాలకు తాగునీటిని అందించేందుకు సత్యసాయి ట్రస్టు ద్వారా మంచినీటి పథకం నిర్మించారు. వైకాపా ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను పక్కనబెట్టడంతో ప్రస్తుతం నిర్వహణ బాధ్యత కష్టతరంగా మారింది. తెదేపా అధికారం చేపట్టిన వెంటనే తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటాం.

ముంపు సమస్యలు పరిష్కారిస్తాం..

గోదావరి వరదలతో విలీన మండలాల్లో ప్రతిఏటా ముంపు సమస్యే. పంటలు మునిగిపోయి నష్టానికి గురవుతున్నారు. పోలవరం పూర్తయితే ఈ సమస్య ఉండదు. ముంపు బాధితులను ఆదుకోవడంతోపాటు ఏటా గోదావరి వరదల సమయంలో అప్రమత్తంగా ఉంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని