logo

సమర్థులు వీరు.. గెలిపించాలి మీరు!

సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపాం. వారిని ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు.

Published : 07 May 2024 06:56 IST

ప్రజలకు చంద్రబాబు పిలుపు

ఈనాడు, అనకాపల్లి, విశాఖపట్నం - అనకాపల్లి/పట్టణం, కశింకోట, న్యూస్‌టుడే: సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపాం. వారిని ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. సోమవారం తాళ్లపాలెం వద్ద జరిగిన ప్రజాగళం సభలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అభ్యర్థులు ఒక్కొక్కరినీ వేదికపై పరిచయం చేస్తూ, వారిని ఎందుకు గెలిపించాలో సభాముఖంగా వివరించారు. చంద్రబాబు వారిని పరిచయం చేశారిలా...

సభకు తరలివస్తున్న శ్రేణులు

  • అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు ఒక చరిత్ర ఉంది. 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. వైకాపా ఎంపీ అభ్యర్థికి అనుభవం లేదు. భాష రాదు. దిల్లీకి పోయి వీధులు వెతుక్కునేసరికి అయిదేళ్లు గడిచిపోతాయి. దిల్లీలోని గల్లీగల్లీ తెలిసిన వ్యక్తి రమేశ్‌. అతన్ని గెలిపించండి. అతని వల్ల పెట్టుబడులు వస్తాయి. విజ్ఞానం ఉన్న వ్యక్తి, పరిచయాలు ఉన్నాయి. చొరవ తీసుకొని పనిచేస్తారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేరుగా మోదీ వద్దకు వెళ్లి పరిష్కరించే స్థాయి ఉంది. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలి.
  • అరకు భాజపా ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత..అనుభవం ఉన్న నేత. పరిచయాలు ఉన్నాయి. మోదీ కాఫీ బ్రాండ్‌ను ప్రపంచం మొత్తం తీసుకువెళ్లారు. వనరులను సమీకరించి గిరిజనులను పైకి తీసుకువచ్చే బాధ్యత ఆమెది. ఆమె విజయం సాధిస్తారనడంలో ఎటువంటి అనుమానం లేదు. అందరూ ఆశీర్వదించాలి.
  • పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు. గాజు గ్లాసు గుర్తు. ఏం తమ్ముళ్లూ ఎవరికైనా అనుమానం ఉందా? పెద్ద మెజార్టీ రావాలి.
  • మాడుగల తెదేపా అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి. పొత్తు ధర్మంలో పెందుర్తి సీటును జనసేనకు ఇచ్చాం. నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి అవ్వడంతో అటు పవన్‌ కల్యాణ్‌, ఇటు నేను ఆలోచించి మాడుగుల అప్పగించాం. ఆయన అవసరం ఉంది. రోజా కేసు పెట్టినా ఎక్కడా తొణకలేదు.
  • చోడవరం తెదేపా అభ్యర్థి రాజు. ఆయనకు కులబలం లేదుగాని, గుణం ఉంది. నీతి ఉంది. సేవ చేయాలన్న ఆలోచన ఉంది. అందుకే ఎమ్మెల్యేగా పెట్టాం. గెలిపించాలి.
  • అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ. సీనియర్‌ నాయకుడు, ఉత్తరాంధ్రకు సేవచేసిన వ్యక్తి. మంచి వ్యక్తి. ఎక్కడా ఎక్కువ మాట్లాడడు. నేను భయపడ్డా. సరైన సమయంలో సరైన నిర్ణయం. అదే జనసేనలో చేరడం. ఆయనను కాకపోతే ఇంకెవరిని గెలిపిస్తారు.
  • విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌. ఆయనా వైకాపా బాధితుడే. గీతం విశ్వవిద్యాలయం గోడలు పగలగొట్టారు. ఏమైనా పగలగొట్టండి.. ఎందులోనూ రాజీపడనంటూ ముందుకు దూసుకువెళ్లారు. ఇతడిని అభినందిస్తున్నా. మీ ఆశీస్సుల కోసం సైకిల్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.  
  • భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. తప్పకుండా గెలిపించి మీరంతా ఆశీర్వదించాలి. భీమిలి తెదేపాకు కంచుకోట. అఖండ మెజార్టీతో గెలిపించాలి.
  • విశాఖ ఉత్తరం భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు. అసెంబ్లీలో చూశా. అయిదేళ్లు మిత్రపక్షంలో ఉన్నా, ప్రజా సమస్యల మీద స్పష్టంగా మాట్లాడే వ్యక్తి. ఎవరినైనా అభిమానిస్తున్నానంటే అందులో విష్ణు ఉంటారు. అతన్ని మంచి మెజార్టీతో గెలిపించాలి. కూటమి పూర్తిగా అండగా ఉంటుంది.
  • విశాఖ పశ్చిమ తెదేపా అభ్యర్థి గణబాబు. తండ్రి నుంచి పార్టీకు సేవలందించిన కుటుంబం. సింపుల్‌గా ఉంటారు. ఆలోచన మాత్రం బలంగా ఉంటుంది. నేను ఒకటే కోరుతున్నా.. పశ్చిమలో మంచి మెజార్టీతో గెలిపించాలి.

అయ్యన్నపాత్రుడు భావోద్వేగం..

నికార్సయిన నాయకుడు నర్సీపట్నం తెదేపా అభ్యర్థి అయ్యన్న. పార్టీ పెట్టినప్పటి నుంచి సైనికుడిగా పనిచేశారు. అరుదైన నాయకత్వం. అనునిత్యం సైకో వేధించినా ఏంచేస్తావ్‌ పీక్కో అన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదరించాలి. నా అనుభవం ఆయనతో 42 ఏళ్లు. ప్రాణం పోయినా రాజీపడలేదు. తెదేపా జెండా పట్టుకొని పుట్టా, శరీరమంతా పసుపు రక్తం ఉంది. చనిపోయినంతవరకు ఇలానే బతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో పెద్దదిక్కు మాకు. అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించాలి. (ఈ మాటలు చెబుతుండగా అయ్యన్నపాత్రుడు భావోద్వేగానికి గురయ్యారు.)

పాయకరావుపేట తెదేపా అభ్యర్థి అనిత..తెదేపా ఆడబిడ్డ. రాజీలేని పోరాటం చేసే వ్యక్తి. సైకో పార్టీ ఇబ్బంది పెట్టింది. ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టించుకోనని దూసుకువెళ్తున్నారు. అనుమానంలేదు. కూటమికి కంచుకోటగా మారుతుంది.

మహిళ ఉత్సాహం

అందరినీ గుర్తుంచుకుంటా

కూటమిలో అభ్యర్థుల ఎంపికలో కొందరికి టిక్కెట్లు దక్కలేదని, వారిని గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల్లో ఉద్ధండులు ఉన్నారు. కొందరికి సీట్లు రాలేదు. ఆ మూడు పార్టీల్లో వారికి ఒక్కటే చెబుతున్నా.. అందరినీ ఆదుకుంటా. సీనియర్‌ నాయకులు దాడి వీరభద్రరావు, ప్రగడ నాగేశ్వరరావు, చలపతిరావు, తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, పి.వి.జి.కుమార్‌, పైలా ప్రసాద్‌, రామానాయుడు, అప్పలనాయుడు వీరందరినీ గుర్తు పెట్టుకుంటా అని హామీ ఇచ్చారు.

ప్రసంగం వింటూ..


ప్రధాని సభకు భారీ భద్రత

సభా ప్రాంగణంలోకి తనిఖీ చేసి పంపిస్తున్న పోలీసులు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు విస్తృత స్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం లోపల జాతీయ భద్రతా దళాలు పర్యవేక్షించాయి. బయట రాష్ట్ర పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 3 వేల మంది విధుల్లో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలోకి వచ్చే వారందరినీ తనిఖీలు చేసి లోపలకు పంపారు. జాతీయ రహదారి పక్కనే సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. లంకెలపాలెం నుంచి వాహనాలను మళ్లించి, భారీ వాహనాలు రాకుండా చేయడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తలేదు. సభ పూర్తయిన వెంటనే ప్రజలు తిరిగి ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. జాతీయ రహదారి పొడవునా పహారా నిర్వహించారు.

తెదేపా జెండాలతో వస్తున్న యువతులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని