logo

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

రేవు దగ్గర ఇసుక కొనుగోలు చేసిన వారికి టన్ను రూ.475కే విక్రయించాలని ప్రతివారం ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తోంది.

Updated : 03 Dec 2022 05:38 IST

రేవుల వద్ద టన్నుకు రూ.550 వసూలు
25టన్నులకు 18టన్నులకే వేబిల్లు
ఇసుక విక్రయాల్లో అక్రమాల తీరు

లంకపల్లి రేవులో తవ్వకాలు

ఈనాడు, అమరావతి: రేవు దగ్గర ఇసుక కొనుగోలు చేసిన వారికి టన్ను రూ.475కే విక్రయించాలని ప్రతివారం ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తోంది. కానీ  తక్కువ ధరకు వస్తుందని రేవు దగ్గరకు వెళ్లిన లారీ డ్రైవర్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. టన్నుకు రూ.550 చొప్పున నగదు వసూలు చేస్తున్నారు. 25 టన్నుల లారీకి రూ.1875 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమంటే.. ‘కలెక్టర్‌కు చెప్పుకుంటారో.. ఇంకెవరికి చెప్పుకుంటారో  చెప్పు కోండి..’ అని ఓ ప్రజాప్రతినిధి అనుచరులు పోలీసుల ఎదుటే సమాధానం ఇచ్చారు. పామర్రు నియోజకవర్గం పరిధిలోని లంకపల్లి రేవులో లారీ డ్రైవర్లకు ఎదురవుతున్న అనుభవం ఇది.!
లంకపల్లి రేవులో  ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఇష్టానుసారం జేసీబీలతో రేయింబవళ్లు తవ్వకాలు జరుగుతున్నాయి. పొలాలు, కరకట్టకు కేవలం 50నుంచి 100మీటర్లలోపు ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం 500 మీటర్ల దూరం ఉండాలి. ఇక్కడ గనుల శాఖ అధికారులు సరిహద్దులు నిర్ణయించలేదు. పమిడిముక్కల తహసీల్దారు తవ్వకాలు నిలిపివేయాలని ఇటీవల సూచించినా ఇసుక మాఫియా లెక్క చేయలేదు.

కంచికచర్ల మండలం కంచెల రేవుకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ గత 20 రోజులుగా అనుమతులు ఉన్నాయంటూ ఓ ఎమ్మెల్యే మనుషులు ఇష్టానుసారం  ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడ కూడా టన్నుకు రూ.550 చొప్పున వసూలు చేస్తున్నారు. 25టన్నులు నింపి.. 18టన్నులకే వేబిల్లు ఇస్తున్నారు. మిగిలిన ఏడు టన్నుల సొమ్ము ప్రత్యేక ఖాతాలోకి వెళుతుందని చెబుతున్నారు. ఆర్టీఏ అధికారులు పట్టుకుంటున్నారని లారీ డ్రైవర్లు చెబితే.. ఎమ్మెల్యే మనుషులమని చెప్పండి అంటూ సమాధానం ఇస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. చేతిరాతతో వే బిల్లులు జారీ చేస్తున్నారు. లారీల డ్రైవర్లు అభ్యంతరం చెబితే.. బెదిరిస్తున్నారు. అధికారులను సైతం ఖాతరు చేయడం లేదు. అసలు గనుల శాఖ అధికారులు రేవుల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ప్రతి రేవుకు గనుల శాఖ జియో కోఆర్డినేట్‌ నిర్ణయించి ఎంత పరిమాణంలో ఇసుక తవ్వకాలు జరపాలో నిర్ణయిస్తుంది. రెండు జిల్లాల్లో ఇంతవరకు సరిహద్దులు సూచించలేదు. రేవులు, నిలువ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తూకం కోసం వేబ్రిడ్జి ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడా వేబ్రిడ్జి లేవు. నిలువ కేంద్రాల వద్ద కూడా లారీలో ఇసుక నింపినందుకు అదనంగా రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. గతంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిప ఉద్యోగులు ఉండే వారు. ఇప్పుడు కంచికచర్ల, నందిగామ ప్రాంతానికి చెందిన యువకులు రేవుల వద్ద విధులు నిర్వహిస్తున్నారు.


లెక్కలోకి రాకుండా..

జేపీ వెంచర్స్‌ పేరుతో ఇచ్చే వే బిల్లులో 18 టన్నులు పేర్కొంటున్నారు. కానీ ఒక్క లారీకి కనీసం 25 టన్నులు నింపుతున్నారు. హైదరాబాద్‌ వెళ్లే లారీలకు 40 టన్నులు నింపుతున్నారు. జిల్లాలో మొత్తం మీద 40లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు ఏడాదికి చేయాల్సి ఉంది. కానీ వేబిల్లుల మతలబుతో రెట్టింపు  తవ్వేస్తున్నారు. పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ ప్రాంతాల్లో రేవుల్లో తవ్వకాలు సాగుతున్నాయి. లంకల్లో సొసైటీ భూములకు సమీపంలో తవ్వకాలు చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 41 ఇసుక రేవులకు గనులు, భూగర్భ గనుల శాఖ గుర్తించింది. తాజాగా వీటికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి. రహదారులు-భవనాలు శాఖ, జలవనరులు, భూగర్బ జలవనరులు, గనులు, రెవెన్యూశాఖలు సంయుక్త తనిఖీలు నిర్వహించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కార్యాలయాల్లోనే కాగితాలపై చూపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో మొత్తం 11 రేవులకే అనుమతి ఉంది. శ్రీకాకుళం, లంకపల్లి, రొయ్యూరు, తోట్లవల్లూరు, చోడవరం ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతుండగా.. అనధికారికంగా ఐలూరులో చేస్తున్నారు. ఐలూరు, చోడవరం, మోపిదేవి మండలంలో కొన్ని రేవులు ఉన్నాయి. వీటి వద్ద ఇప్పుడు అర్థరాత్రి తవ్వకాలు జరుపుతున్నారు. ఐలూరులో లిప్టు ఇరిగేషన్‌ స్కీం పక్కనే 100 మీటర్ల దూరంలో తవ్వకాలు జరుపుతున్నారని రైతులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని