logo

ఉల్టా లాగేస్తున్నారు..!

రోడ్డు పక్కన టీ తాగినా.. పానీపూరీ తిన్నా.. షాపింగ్‌కు వెళ్లినా.. అవసరం ఏదైనా.. రూ.5 అయినా రూ. 50వేలు అయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం బాగా పెరిగింది.

Published : 07 Jun 2023 05:13 IST

క్యూఆర్‌ కోడ్‌, చెల్లింపు రిక్వెస్ట్‌లు పంపుతూ మోసం
స్కాన్‌ చేస్తే ఖాతాల నుంచి డబ్బు మాయం
భారీగా కేసుల నమోదు

ఈనాడు - అమరావతి: రోడ్డు పక్కన టీ తాగినా.. పానీపూరీ తిన్నా.. షాపింగ్‌కు వెళ్లినా.. అవసరం ఏదైనా.. రూ.5 అయినా రూ. 50వేలు అయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం బాగా పెరిగింది. టక్కున జేబులోని మొబైల్‌ తీసి బిల్లు చెల్లించడం ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైంది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పలు యాప్‌లు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. వీటిని కేటుగాళ్లు తమ మోసాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా కొత్త ఎత్తుగడలతో ఏమాత్రం అనుమానం రాకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. నగరంలో ఈ తరహా మోసాలకు సంబంధించిన కేసులు పలు స్టేషన్లలో నమోదు అవుతున్నాయి.

రిక్వెస్ట్‌ పేరుతో ఎర

*  తన ఇంటిని అద్దెకు ఇస్తానని, విజయవాడ నగర శివారు గ్రామానికి చెందిన మహిళ ఓ యాప్‌లో ప్రకటన ఇచ్చారు. దీనికి స్పందనగా ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. తాను బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగినని, గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. ఇంట్లో అద్దెకు దిగుతానని, ముందుగా రూ.5వేలు అడ్వాన్స్‌ను గూగుల్‌ పే ద్వారా పంపుతున్నట్లు చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి తన గూగుల్‌ పే ఖాతాకు పంపిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంతో అంతమొత్తం పోయింది.
*   కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఓ సైట్‌లో తన ఇంటిని అద్దెకు ఇస్తున్నట్లు, ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని ఫోన్‌ నెంబరు ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తమ కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు దిగుతామని చెప్పాడు. అడ్వాన్స్‌ మొత్తాన్ని యూపీఐ యాప్‌ ద్వారా రూ.40వేలు పంపుతున్నానని, తాను క్యూఆర్‌ కోడ్‌ పంపుతున్నట్లు.. దానిని స్కాన్‌ చేయాలని చెప్పాడు. నిజమే అని నమ్మిన ఆమె, తన ఫోన్‌కు వచ్చిన ఆ కోడ్‌ను స్కాన్‌ చేసింది. ఆమె ఖాతా నుంచి ఆ మేరకు నగదు మాయం అయింది.

తరచిచూడాలి..

*    చెల్లింపు యాప్‌ల్లో ఉండే ‘రిక్వెస్ట్‌’ అనే ఫీచర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనకు డబ్బు పంపించాల్సిన వ్యక్తికి దీనిని పంపుతూ, కావాల్సిన మొత్తాన్ని ఇందులో నమోదు చేస్తాం. అవతలి వ్యక్తి Ëక్లిక్‌ చేయగానే అంత మేర నగదు, వారి ఖాతా నుంచి పంపిన వారికి జమ అవుతుంది. దీని గురించి తెలియని వారికి, తమకు అంత మొత్తం డబ్బు పంపుతున్నారేమో అని రిక్వెస్ట్‌ను అంగీకరిస్తూ క్లిక్‌ చేస్తారు. దీని వల్ల నగదు పోతుంది.
*    మీకు డబ్బు పంపుతున్నామంటూ వాట్సాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను మోసగాళ్లు పంపుతున్నారు. దీనిని స్కాన్‌ చేస్తే నగదు, మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మిస్తున్నారు. తీరా స్కాన్‌ చేస్తే..ఆ మేరకు డబ్బు ఖాతా నుంచి డెబిట్‌ అవుతోంది.
జాగురూకతతో నివారించవచ్చు
*    యూపీఐ యాప్‌ ద్వారా నగదు స్వీకరించే సమయంలో పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు.
*   ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డబ్బు పంపించమని ఉన్న రిక్వెస్ట్‌ను అంగీకరించొద్దు.
*    ఎవరితోనూ యూపీఐ పిన్‌ను పంచుకోవద్దు.
*    క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా డబ్బు పంపించాల్సిన వ్యక్తి వివరాలు తెలుసుకుని లావాదేవీ నిర్వహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని