logo

బిల్లు చూస్తేనే... షాక్‌!

అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలతో మరింత భారంగా మారుతున్నాయి.

Published : 31 Jul 2023 05:06 IST

ఒకేదఫా మూడు సర్దుబాటు ఛార్జీలతో విలవిల
ఉమ్మడి జిల్లా ప్రజలపై రూ.700 కోట్ల మేర బాదుడు
ప్రభుత్వ వైఖరిపై అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం

అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలతో మరింత భారంగా మారుతున్నాయి. ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపతుండడంతో సామాన్యులు హడలుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలపై ఈ ఛార్జీల భారం సుమారు రూ.700 కోట్ల మేర పడుతోంది. భారీగా వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు, ఈ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని వాపోతున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. సర్దుబాటు భారం వినియోగదారుల నడ్డి విరుస్తోంది. డిస్కమ్‌కు నష్టాలు వచ్చాయంటూ ఇప్పుడు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • విజయవాడ రాణిగారితోటకు చెందిన ఓ మహిళాకూలీ ఇంటికి జులైలో వచ్చిన కరెంటు బిల్లు రూ.4,576. గతంలో ఎప్పుడూ రూ.1,200 మించి వచ్చేది కాదు. ఈసారి వచ్చిన బిల్లు చూసి నిర్ఘాంతపోయింది. ఈ బిల్లులో ట్రూఅప్‌ ఛార్జీలు రూ.110.31, 2021 జూన్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీ రూ. 113.17, ఈ ఏడాది మే సర్దుబాటు ఛార్జీ రూ.135.60 చొప్పున వెరసి మొత్తం రూ.359.08 విధించారు. బిల్లు సరిచూడమని విద్యుత్తు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక అప్పు చేసి చెల్లించింది.
  • విజయవాడలో పాయకాపురం ప్రాంత సాధారణ కుటుంబానికి జులైలో రూ.982 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఇందులో ట్రూ అప్‌ భారం రూ.38.92 కాగా, 2021 జూన్‌ సర్దుబాటు ఛార్జీ రూ.21.31, ఈ ఏడాది మే సర్దుబాటు ఛార్జీ రూ.69.20 వంతున మొత్తం రూ.129.43 భారం మోపారు. చిన్న పనులు చేసి బతికే తాము ఈ బిల్లు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు.

కంచికచర్లలో ఓ మహిళ ఇంటికి రూ.1,240 బిల్లు వచ్చింది. అసలే పేద కుటుంబం.. ఆపై భారీగా వచ్చిన బిల్లు భారంగా మారిందని వాపోయింది. ట్రూఅప్‌ ఛార్జీ రూ.50, ఇంధన సర్దుబాటు ఛార్జీ రూ.80 చొప్పున సర్దుపోటు రూ.130 వడ్డించారు. సర్దుబాటు ఛార్జీల పేరిట పది శాతం మేర బిల్లు పెరిగింది.

తడిసిమోపెడు...

విద్యుత్తు వ్యాపారానికి సంబంధించి 2014-15 నుంచి 2018-19 కాలంలో డిస్కమ్‌కు నష్టాలు వచ్చాయని ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ కాలంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్‌కు 22 పైసలు చొప్పున లెక్కగట్టి నిరుడు ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నారు. మొత్తం 36 నెలలు విధించే ఈ ఛార్జీల్లో ఇప్పటి వరకు 12 నెలలకు వేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వినియోగదారులపై ఈ భారం రూ. 270 కోట్లు విధించారు. దీంతోపాటు 2021-22లో నష్టాల పేరుతో మరో రూ.వంద కోట్ల భారం మోపారు. దీనిని 2021-22లో ఏ నెలలో వాడిన యూనిట్లను 2023-24లో అదే నెలలో బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. యూనిట్‌కు 20 పైసలు నుంచి గరిష్ఠంగా 66 పైసల వరకు ఈ భారం విధించారు. యూనిట్‌ వారీగా నాలుగు త్రైమాసికాలకు... రూ.0.20, రూ.0.63, రూ.0.63, రూ.0.66 చొప్పున లెక్కించి వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సంబంధిత నెలలో వాడుకున్న విద్యుత్తుపై తర్వాత నెలలో వచ్చే బిల్లులో లెక్కించి సర్దుబాటు చేస్తున్నారు. ఈ భారం రూ.330 కోట్ల మేర పడుతోంది. వెరసి ఈ మూడు రకాల భారాల కారణంగా ప్రజలపై రూ.700 కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల పేరిట మోపుతున్నారు.

  • కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఓ కుటుంబానికి జులైలో కరెంటు బిల్లు రూ.487 వచ్చింది. ట్రూ అప్‌ ఛార్జీ.. రూ.24.46, 2021 జూన్‌ సర్దుబాటు భారం రూ.2.82, ఈ ఏడాది మే సర్దుబాటు రుసుము రూ.48.40 వంతున రూ.75.68 భారం వేశారు. పని చేస్తేనే ఇల్లు గడిచే ఈ కుటుంబానికి ప్రతి నెలా విద్యుత్తు బిల్లు షాక్‌ కొడుతోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు