logo

నీవే నేనని.. నీవు లేక లేనని!

తన ఆటలు, అల్లరితో ఆ చిట్టితల్లి సందడి చేస్తుంటే ఆ కుటుంబంలో నవ్వులు తొణికిసలాడేవి.. ఇప్పుడిప్పుడే వస్తున్న ముద్దు ముద్దు మాటలతో అందరినీ పిలుస్తుంటే ఇంటిల్లిపాదీ మురిసిపోయేవారు..

Updated : 02 Aug 2023 09:26 IST

ఉసురు తీసిన వాటర్‌ హీటర్‌
11 నెలల చిన్నారి, తల్లి మృతి

బంటుమిల్లి, న్యూస్‌టుడే: తన ఆటలు, అల్లరితో ఆ చిట్టితల్లి సందడి చేస్తుంటే ఆ కుటుంబంలో నవ్వులు తొణికిసలాడేవి.. ఇప్పుడిప్పుడే వస్తున్న ముద్దు ముద్దు మాటలతో అందరినీ పిలుస్తుంటే ఇంటిల్లిపాదీ మురిసిపోయేవారు.. ఆ ఇంటిలో బుడిబుడి అడుగులతో, తన తల్లి వెంటే ఉంటున్న చిన్నారి ఆ తల్లితో పాటే మృత్యుఒడికి చేరిన విషాదకర సంఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట పంచాయతీలోని జానకిరామపురంలో మంగళవారం చోటుచేసుకొంది. మరో 15 రోజుల్లో మొదటి పుట్టినరోజును వేడుకగా నిర్వహించాలనుకుంటున్న తరుణంలో ఆ చిట్టితల్లితో పాటు తల్లినీ విద్యుదాఘాతం రూపంలో వాటర్‌ హీటర్‌ ప్రాణాలు తీయడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

బంటుమిల్లి మండలంలోని చోరంపూడికి చెందిన అనూష(23)ను జానకిరామపురానికి చెందిన వల్లభు శివకృష్ణకు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం చేశారు. వారి కుమార్తె ధన్సిక (11 నెలలు). మరో 15 రోజుల్లో ధన్సిక మొదటి పుట్టిన రోజు చేసేందుకు మాట్లాడుకుంటున్నారు. అత్తామామలు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. మంగళవారం ఉదయం భర్త యథావిధిగా తాపీ పనికి బయటకు వెళ్లాడు. ఇంటిలో సాయంత్రం 5 గంటల సమయంలో తల్లి తన కుమార్తెను ఎత్తుకొని ఇంటి పనులు చేసుకొంటోంది. వేడి నీళ్లు కాద్దామని వాటర్‌ హీటర్‌ను బకెట్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేయగా  విద్యుదాఘాతానికి గురవడంతో ఇద్దరూ అక్కడే పడిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉండే బంధువుల పిల్లలు ఆడుకుందామని వచ్చేసరికి తల్లీకుమార్తెలు కింద పడి ఉండడాన్ని గమనించి ఇంట్లో వారికి చెప్పారు. వారొచ్చి వెంటనే విద్యుత్తు సిబ్బందికి సమాచారం ఇవ్వగా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. విద్యుదాఘాతానికి గురైన ఇద్దరినీ వెంటనే బంటుమిల్లిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుడు తల్లి, బిడ్డ ఇద్దరూ మరణించినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మనవరాలి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని ఆడుకొందాం రామ్మా అంటూ తాత చేసిన ప్రయత్నం అందరినీ కంటతడి పెట్టించింది. తనను ఒంటరి వాడిని చేసి భార్య, కూతురు ఇద్దరూ వెళ్లిపోయారని శివకృష్ణ గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవరి వల్లా కాలేదు. సమాచారం అందుకొన్న బంటుమిల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు