logo

మోగింది కల్యాణ వీణ

ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో ముహూర్తాలు లేక రెండు నెలలుగా వివాహాది శుభకార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి.  నిజశ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల .సందడి తిరిగి ఊపందుకోనుంది.

Updated : 19 Aug 2023 05:53 IST

నిజశ్రావణ మాసం ఆరంభంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు

న్యూస్‌టుడే, చల్లపల్లి గ్రామీణం, అవనిగడ్డ: ఆషాఢం, అధిక శ్రావణ మాసాలతో ముహూర్తాలు లేక రెండు నెలలుగా వివాహాది శుభకార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి.  నిజశ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల .సందడి తిరిగి ఊపందుకోనుంది. శనివారం నుంచి డిసెంబరు 31 వరకు దాదాపు 50కిపైగా ముహూర్తాలు ఉండటంతో ఇక వివాహాలు ముమ్మరంగా సాగనున్నాయి. దీంతో కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. వాటితోపాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు కూడా ఊపందుకోనున్నాయి.

  • శుభకార్యక్రమాల నిర్వహణలో అనుసంధానంగా ఉన్న దాదాపు 25 రంగాలవారికి చేతి నిండా పని దొరికినట్లే. పురోహితులు, ట్రావెల్స్‌, వస్త్రదుకాణాలు, టైలరింగ్‌, కిళ్లీలు, బాజాబజంత్రీలు, తీన్‌మార్‌ డప్పు కళాకారులు, వంటమేస్త్రీలు, క్యాటరింగ్‌, అలంకార నిపుణులు, బ్యూటీ పార్లర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, మైకు సిస్టమ్‌, కల్యాణ మండపాలు, కళాకారులు, సెలబ్రెటలు, గాయకులు, సప్లయర్లు, కూరగాయలు, అరటి ఆకుల సరఫరాదారులు, విద్యుత్తు తదితర రంగాల వారికి అయిదు నెలల పాటు ఉపాధి లభించనుంది.

ముహూర్తాలివే..

ఆగస్టులో: 19, 20, 22, 24, 26, 29, 30, 31
సెప్టెంబరు : 1, 2, 3, 6, 7, 8
అక్టోబరు : 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31.          
నవంబరు : 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29
డిసెంబరు : 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31  

ఉచిత వివాహాలకు అవకాశం

పెళ్లిళ్లు, విందుల ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలవారు భారీ బడ్జెట్‌ కేటాయించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ దేవాలయంలో ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వధూవరులకు మంగళసూత్రాలు, పట్టువస్త్రాలు, కాలి మెట్లు, తదితరాలను దేవస్థానం వారు ఉచితంగా సమకూరుస్తున్నారు.

  •  వెంకటాపురం రామాలయంలో కూడా వధూవరులకు ఆలయ వ్యవస్థాపకులు రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు.

సంప్రదాయాలతో డెకరేషన్‌: మెరకనపల్లి నరేష్‌, అలంకార నిపుణుడు

పాతతరంలో మాదిరిగా కొబ్బరి, తాటాకులతో పందిళ్లు వేయడం, సహజమైన పూల తోరణాలు, మామిడి ఆకులతో కల్యాణ మండపాలను అందంగా అలంకరిస్తున్నాం. వీనుల విందుగా పాతపాటలు, హాస్యంతో ఆకట్టుకునే కళాకారులను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం మీద గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా పెళ్లి సందడి ఏర్పాట్లు చేయబోతున్నాం.


విరామం లేకుండా...

ఈ సంవత్సరం ఆఖరు వరకు దాదాపు 50కిపైగా సుముహూర్తాలున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం వల్ల కల్యాణ మండపాల్లోనే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాం. శుభ కార్యక్రమాలకు తోడు సీజనల్‌గా వచ్చే శ్రావణ మాస పూజలు, వ్రతాలు, గణపతి, శరన్నవరాత్రి, కార్తికమాస పూజలు అదనంగా ఉన్నాయి.

 అడుసుమిల్లి కుటుంబరావు, పురోహితుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు