logo

Dastagiri: జగన్‌కు ఓటేస్తే గొంతు కోసుకున్నట్లే: దస్తగిరి

రాష్ట్రంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌, పులివెందుల జైభీమ్‌రావు భారత్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు.

Updated : 20 Mar 2024 07:28 IST

మాట్లాడుతున్న దస్తగిరి

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌, పులివెందుల జైభీమ్‌రావు భారత్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. విజయవాడ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్‌ రాజ్యాంగం నడుస్తోంది. ఈసారి జగన్‌కు ఓటు వేస్తే.. మన గొంతు మనం కోసుకున్నట్లే. దళితుల ఓట్లతో గెలుపొందిన జగన్‌ నేడు వారినే టార్గెట్‌ చేశారు. రాష్ట్రంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో దళితులపై దాడులు, హత్యాచారాలు జరిగాయి. రాష్ట్రంలో దళితులకు కనీస రక్షణ లేకుండా పోయింది. పులివెందులలో పోటీ చేయడానికి ముఖ్య కారణం.. అక్కడి ప్రజలు జగన్‌ చేతిలో మోసపోవడమే.. ముఖ్యమంత్రి అమాయక ప్రజలను మోసం చేసి తిరిగి గద్దెనెక్కాలని చూస్తున్నారు. దళితులను కొట్టడం గొప్పతనం కాదు. దళిత మహిళలపై అత్యాచారాలు చేసి పోలీస్‌స్టేషన్‌ ముందు పడేసినా ఈ ప్రభత్వంలో చర్యలు శూన్యం. పోలీసులు చట్టాలను రక్షించడం లేదు. కేవలం పాలకులకు దాసోహమంటున్నారు. వారి మెప్పు కోసం సమాజంలో అణగారిన వర్గాలైన.. దళితులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు.  నా ఎస్సీ, నాఎస్టీ, నా బీసీ అనే ముఖ్యమంత్రి దళితులకి చేసిన సామాజిక, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?. హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ జగన్‌. ఆయనను ప్రజలు తిరిగి గెలిపిస్తే ఏపీ మరో బిహార్‌లా మారడం ఖాయం. దళిత నాయకుడి స్థలం లాక్కుంటే.. నేను వెళ్లి పరామర్శించాననే కారణంతో నాపైనే వైకాపా నాయకులు ఆరోపణలు చేశారు. నా తండ్రిపై దాడి జరిగిన మాట వాస్తవం.  వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పార్టీ అధినేత శ్రావణ్‌కుమార్‌ నాయకత్వంలో పని చేస్తా. పులివెందులో తప్పకుండా విజయం సాధిస్తానని’ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని