logo

‘అతడి ఆత్మహత్యాయత్నానికి కారకులెవరు..?’

ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం.

Published : 29 Mar 2024 04:05 IST

స్థల వివాదమా..? పోలీసులా..?

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ మనిషి ప్రాణం తీసుకునేలా ప్రేరేపించడం దారుణం. న్యాయం కోసం వస్తే కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన వారే అతడి ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం శోచనీయం. గుడివాడకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడానికి రెండు సెంట్ల స్థల వివాదమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. పట్టణంలోని కరెంటు ఆఫీసు సమీపంలో నివాసం ఉండే చిరు రియల్‌ వ్యాపారి తన స్నేహితుడితో కలిసి నాగవరప్పాడు వాసవీ నగర్‌లో రెండు సెంట్ల స్థలం కొన్నట్లు సమాచారం. వ్యాపారి స్నేహితుడికి రూ.ఆరు లక్షలు అప్పుగా ఇచ్చాడని తెలిసింది. స్థలాన్ని తన కుమార్తె పేరున కొనడంతో ఆమె అమ్మకానికి పెట్టింది. స్థలం అమ్మడం ఇష్టం లేదని వ్యాపారి తేల్చి చెప్పగా ఆమె ఒక వైకాపా నాయకుడి ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు పోలీసుల వద్దకు వెళ్లారు. సివిల్‌ సెటిల్‌మెంట్లు చేయొద్దని కోర్టు ఉత్తర్వులున్నా అక్కడి సిబ్బంది వాటని తోసిరాజని సెటిల్‌ చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. స్నేహితుడి వద్ద తీసుకున్న రూ.లక్షకు మరో రూ.లక్ష వడ్డీ కలిపి ఇవ్వాలని.. స్థలాన్ని రూ.ఆరు లక్షలకు విక్రయించి మిగిలిన రూ.4 లక్షలు ఇస్తామని చెప్పి స్థల రిజిస్ట్రేషన్‌కు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తనకు తీవ్రంగా నష్ట పెట్టారని మనస్తాపానికి గురైన ఆ చిరు వ్యాపారి ఆ స్థలం వద్దకు వెళ్లి ఈ నెల 27న పురుగు మందు తాగి రిజిస్ట్రేషన్‌ ముందు రోజు ఆత్మహత్యకు యత్నించాడని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ అవుతోంది. దీంతో అతడ్ని నాగవరప్పాడులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ అతడు అత్యవసర విభాగంలోనే చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం వార్త విని ఠాణా సిబ్బంది స్థానికంగా వారికున్న పలుకుబడినంతా ఉపయోగించి వ్యాపారి కుటుంబంతో సెటిల్‌ చేసుకోవాలని యత్నిస్తున్నారు. వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి కారకులు తాము కాదని, కారణం తెలీదని వచ్చినవారికి ఆమె చెప్పేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై ఆసుపత్రికి వెళ్లి బాధితుడి భార్యను ప్రశ్నించగా తనకేమీ తెలీదని.. తన భర్త స్ఫృహలోకి వచ్చి చెబితే తెలుస్తుందని ఆమె చెబుతోంది. డీఎస్పీ పి.శ్రీకాంత్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ దీనిపై ప్రస్తావించగా తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ నేపథ్యంలో జీతం ఇవ్వడం లేదని ఓ ఔషధ దుకాణంలో పని చేస్తున్న ఉద్యోగి అడిగితే తనతోపాటు కుటుంబ సభ్యులపై యజమాని దాడి చేశారని యువకుడు ఫిర్యాదు చేయగా ఠాణా సిబ్బంది కేసు నమోదు చేయక పోగా దుకాణ యజమానికి మద్దతు పలికారు. ఉద్యోగిని భయపెట్టి కేసు లేకుండా చేశారని చర్చించుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని