logo

AP News: కోడ్‌కు రాంరాం.. వైకాపాకే సలాం!

గన్నవరంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు గమనించిన తెదేపా నాయకురాలు, కడప అభ్యర్థిని మాధవిరెడ్డి చిత్రాలు తీసి.. సీ విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేయబోయారు.

Updated : 06 Apr 2024 07:10 IST

అనుకూలురునే వేయించుకున్న నేతలు
పోలీసుల బదిలీల్లోనూ వారిదే పెత్తనం
ఈనాడు, అమరావతి


గన్నవరంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు గమనించిన తెదేపా నాయకురాలు, కడప అభ్యర్థిని మాధవిరెడ్డి చిత్రాలు తీసి.. సీ విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేయబోయారు. అంతే... వైకాపా కార్యకర్తలు ఆమె కారును అడ్డుకొని హల్‌చల్‌ చేశారు. పోలీసులు సైతం ఆమెతోనే దురుసుగా ప్రవర్తించి.. కారును కదలనీయలేదు. గన్నవరం సీఐ ఆధ్వర్యంలో ఈ ఘటన జరగ్గా.. వైకాపా కార్యకర్తల తరహాలో పోలీసులు వ్యవహరించారు.


 

గుడివాడలో గంజాయి బ్యాచ్‌ ఒక అమ్మాయిని వేధిస్తే.. పోలీసులను ఆశ్రయించారు. కనీసం కేసు నమోదు చేయకపోగా నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకుని పంచాయితీ చేశారు. ఎస్పీ జోక్యంతో కేసు కట్టాల్సిన దుస్థితి. గుడివాడలో మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో... ఖాకీలు వైకాపా సేవలో ఉన్నారు. ఆ అమ్మాయి తెదేపా కార్యకర్త కూడా కాదు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోకపోవడం.. సస్పెండ్‌ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గతంలో తెలుగుమహిళ ఒకరు నల్లజెండా ఎగరేస్తే.. ఆమెపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఈ పోలీసులే కావడం గమనార్హం.


నిత్యం హైదరాబాద్‌కు ఇసుక రవాణా అవుతుంటే.. తెదేపా నాయకులు లారీలను పట్టుకుని స్వయంగా వత్సవాయి ఠాణాలో అప్పగిస్తే.. కనీసం కేసు పెట్టలేదు. అక్కడి అధికారి, సిబ్బంది సహకారంతో వైకాపా నాయకులు పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలిస్తున్నారు. చిల్లకల్లు ఎస్సైగా ఉన్న అధికారి.. మల్కాపురంలో ఇసుక తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటే.. వారిపైనే కేసులు పెడతానని బెదిరించి మరీ వైకాపా వారి అక్రమ తవ్వకాలకు కొమ్ము కాశారు.


ఇలాంటి సంఘటనలు ఒకటా రెండా.. అన్ని స్టేషన్లలోనూ ఇంతే. నిన్నమొన్నటి వరకు వైకాపా నేతలతో అంటకాగిన పోలీసు అధికారులు దీర్ఘకాలంగా పని చేస్తున్నారనే కారణంతో అక్కడికక్కడే బదిలీ చేయించుకున్నారు. శాంతి భద్రతల నుంచి ఎస్‌బీ శాఖకు కొందరు వెళ్లారు. కొందరు ఇతర నియోజకవర్గాలకు వెళ్లారు. వైకాపా నేతలు నియోజకవర్గాలు మారితే.. వారితోపాటు పోలీసులనూ బదిలీ చేయించుకుని తమ ప్రాంతాలకు తెచ్చుకున్నారు. ఎన్నికల కోడ్‌ ఉంది నిష్పక్షపాతంగా ఉన్నామని నీతులు చెబుతున్నా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వైకాపా నాయకులకే సహకరిస్తున్నారు. నేతలు పెద్దఎత్తున తాయిలాలు పంచేస్తున్నా.. కళ్లకు గంతలు కట్టుకుని కూర్చున్నారు. వాచీలు, కుక్కర్లు, చీరలు, ఇతర సామగ్రి భారీగా పంచుతుంటే.. తమకు సమాచారం లేదని, మీకు తెలిస్తే సమాచారం ఇచ్చి సహకరించాలని పోలీసు బాస్‌లు మీడియాకు సూచనలు చేస్తున్నారు.

కళ్లు మూసుకున్నారు.. నిఘా విభాగాలు, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, జీడీ విధులు నిర్వహించే పోలీసులు ఉన్నా.. తమకు సమాచారం లేదని పోలీసు బాస్‌ పేర్కొనడం పోలీసుల దురవస్థను తెలుపుతోంది. ఇటీవల విజయవాడ సెంట్రల్‌లో వెలంపల్లి కుక్కర్లు భారీగా పంచినా ఒక్క కేసు నమోదు కాలేదు. పెనమలూరు పరిధిలో మంత్రి జోగి ఇష్టానుసారం పోలీసుల సాక్షిగా పంచేసినా.. ప్రేక్షకపాత్రే. పోలీసు బాస్‌ ఆదేశాలతోనే కింది స్థాయిలో వైకాపా నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.


ఎన్నెన్నో ఉదంతాలు...

గన్నవరం

ఇక్కడ తెదేపా కార్యాలయంపై దాడి జరిగింది. దీనికి పోలీసు బాస్‌ సహకారం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇటీవల ఈసీ బదిలీ వేటు వేసిన ఎస్పీ జాషువా.. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో వైకాపా కార్యకర్తగానే వ్యవహరించారనే ఫిర్యాదులు ఉన్నాయి. గన్నవరంలో దాడి ఘటన, యువగళం పాదయాత్రలో తెదేపా నాయకులపై ఏకపక్షంగా కేసులు పెట్టించారు. తెదేపా నేత కొల్లు రవీంద్రను ఒక రోజంతా మాయం చేశారు. పలు పోలీసుస్టేషన్‌లు తిప్పారు. ఆయన భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించాక ఆచూకీ చూపించారు. కేవలం ముందస్తు జాగ్రత్త కోసం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో గన్నవరంలో రూ.కోట్ల విలువైన క్యాసినోకు ప్రత్యక్ష సహకారం అందించారు. వైకాపా నేతల అడుగులకు మడుగులు వత్తారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పోలీసు బాస్‌ ఆ తరహాలో ఉంటే స్టేషన్‌ అధికారులు ఇంకాస్త జోరు పెంచి అక్రమాలకు ఊతంగా మారారు.

విజయవాడ సెంట్రల్‌

పాయకాపురం పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇటీవల బొండా ఉమాపై ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. దుర్భాషలాడిన వెలంపల్లిపై మాత్రం కేసు పెట్టలేదు. తెదేపా ఆందోళన చేయగా ఇరువర్గాలపై కేసు నమోదు చేయడం గమనార్హం. సెంట్రల్‌ పరిధిలో అయిదు ఠాణాల అధికారులతో వైకాపా అభ్యర్థి మంతనాలు చేసినట్లు పోలీసు వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది.


విజయవాడ పశ్చిమ

భవానీపురం ఠాణాలోనూ ఒక పోలీసు అధికారి చెప్పిందే వేదం. ఆయన మాజీ మంత్రి అండతో పోస్టు వేయించుకున్నారు. ఇటీవల తన బాస్‌ బదిలీ అయిన ప్రాంతానికి తానూ బదిలీ చేయించుకున్నారు. వైకాపా నేతలకు పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. తెదేపా నేతలు కదిలితే కేసు.. మెదిలితే కేసు అన్నట్లు వ్యవహరించారు.


పెనమలూరు

పెనమలూరులో పోలీసుల వైఖరి మరీ దారుణం. పెనమలూరు ఠాణా అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ సీఐ బదిలీ అయ్యారు. ఆయన ఉన్నప్పుడు వైకాపా నాయకులు తప్ప తెదేపాకు స్థానం లేదు. మంత్రి జోగి మాటే చెల్లుబాటు అవుతుంది. చోడవరం, మద్దూరులో ఇసుక తవ్వకాలను తెదేపా అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కేసు నమోదు చేయలేదు. కంకిపాడు, ఉయ్యూరు స్టేషన్‌లోనూ కనపడని వైకాపా జెండాలను కప్పుకొన్నారే విమర్శలు ఉన్నాయి.


విజయవాడ తూర్పు

అరాచకాలకు ఖాకీలు ఇచ్చిన అండ అంతాఇంతా కాదు. తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్‌తో కంటి మీద దాడి చేస్తే.. సీఐ మాత్రం చేతులతో దాడి చేశారని కేసు నమోదు చేశారు. ఆయన కంటికి గాయాలైన విషయం తెలిసిందే. సీపీ కూడా సీఐ చెప్పిన విషయానికి వంతపాడారు. సాధారణ కేసులు కట్టారు. తెదేపా నేత పట్టాభి ఇంటిపై రెండుసార్లు దాడి జరిగినా నామమాత్ర కేసులు కట్టారు. కృష్ణలంకలో మైనార్టీ మహిళ చనిపోయినప్పుడు పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు.


నందిగామ

నందిగామ గ్రామీణ సీఐగా పనిచేసిన అధికారి వైకాపా చెప్పుచేతల్లో ఉండేవారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మీద ఎస్సీ, ఎస్టీ కేసు కట్టడం విశేషం. ఆమెపైకి తరచూ దూకుడుగా వెళ్లేవారు. అవమానించేలా వ్యవహరించేవారు. దీనికి కారణం అక్కడ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.. అండతో పోస్టింగ్‌ తెచ్చుకోవడమే. ఇప్పుడు విజయవాడ నగర పోలీస్‌ పరిధిలోకి మారినా అదే తీరు. తెదేపా సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కంచికచర్ల ఎస్సై ఒకరు గనిఆత్కూరులో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే.. తెదేపా కార్యకర్తలనే బెదిరించారు. ఇసుక లారీలకు ఎస్కార్టులా తయారయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని