logo

వారం అన్నావు.. వాగ్దానం మరిచావు: జగన్‌పై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తాను..ఈ విషయంలో మాట తప్పను..మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ అమలు చేయలేదు.

Updated : 12 Apr 2024 08:14 IST

న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్‌

ధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తాను..ఈ విషయంలో మాట తప్పను..మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ అమలు చేయలేదు.పైగా ఉద్యోగులకు ఉపయోగపడని గ్యారెంటీ పింఛను పథకాన్ని(జీపీఎస్‌)తెచ్చి ఏదో ఉద్యోగులకు చేసేశామని చెప్పడం పట్ల ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇచ్చిన హామీని అమలు చేయాలని ఉద్యోగులు రోడ్లెక్కి ఇంత పెద్దఎత్తున నిరసన చేపట్టిన దాఖలాలు కూడా గతంలో లేవు. ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌ నినాదంతో కూడా ఇటీవల ఆందోళన చేపట్టారు. అనేక బకాయిలు కూడా ఏళ్లతరబడి చెల్లించకపోవడంతో ఉద్యోగవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 5వేలమందికి పైగా వివిధశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, 8 వేలమందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో ఉద్యోగి 30 ఏళ్ల సర్వీసులో నాల్గవ వంతు కోల్పోవాల్సి వస్తుంది. అంటే దాదాపు ఒక్కొక్కరు తమ మూలవేతనాన్ని బట్టి రూ.లక్షల్లో నష్టపోతారు. సీపీఎస్‌ను రద్దుచేస్తే ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు, ప్రస్తుతం జరుగుతున్న నష్టం, వారు పడుతున్న ఇబ్బందులపై పలు సంఘాల నాయకులు ఈ విధంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.


నెలానెలా వసూలు

- తోట వరప్రసాద్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి

సీపీఎస్‌ చందాను నెలనెలా ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తారు. పాత పింఛను విధానంలో అలా ఉండదు. 30 నుంచి 35ఏళ్ల పాటు ప్రభుత్వ సేవచేసిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తరువాత ఉద్యోగులకు కల్పించాల్సిన ఆర్ధిక, సామాజిక భద్రత నుంచి ప్రభుత్వం వైదొలగడం సరికాదు. ఈ విధానంలో ఉద్యోగికి తన ఉద్యోగ విరమణ తరువాత ఎంత వస్తుంది..ఎంత పింఛను వస్తుందో కూడా కచ్చితంగా తెలియదు.ఇలా అన్ని విధాలుగా ఉద్యోగులకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.


రద్దు చేస్తేనే ఉద్యోగులకు ప్రయోజనం

- అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్‌(257) జిల్లా అధ్యక్షుడు

సీపీఎస్‌ రద్దు చేస్తే తప్ప ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దశాబ్దాలపాటు సేవలు అందించిన ఉద్యోగి అరకొర పింఛనుతో ఎలా జీవించగలరు. ఆర్థిక ఆసరా లేక పోతే వృద్ధాప్యంలో ఎన్ని అవస్థలు పడాలో అందరికీ తెలిసిందే. అన్ని సమస్యలు ఉండబట్టే సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు అంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సీపీఎస్‌ రద్దు చేయకపోగా ఉపాధ్యాయుల నియామకాల్లో గతంలో రద్దు చేసిన అప్రంటీస్‌ విధానాన్ని తీసుకువచ్చారు. దీని వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులకంటే ప్రయివేటుకు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.


భద్రత ఉండదు

- పి.రాము, ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌రద్దు చేయాలని సంఘ పరంగా అనేకసార్లు ప్రభుత్వ పెద్దలను కలిశాం. సీపీఎస్‌ వల్ల ఉద్యోగులకు కలిగే నష్టాలను కూడా వివరించారు. సీపీఎస్‌ విధానంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక, సామాజిక భద్రత ఉండదు. అదే పాత పింఛను విధానంలో అయితే ప్రతినెలా పింఛను రావడం వల్ల అతనికి భద్రత ఉంటుంది. అనేక ఏళ్లపాటు సర్వీసు చేసిన వ్యక్తిగా భద్రత లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని