logo

కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ

రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్‌ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 06:02 IST

ర్యాలీగా వెళ్తున్న బాలశౌరి, రాము, రావి, కొనకళ్ల తదితరులు

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్‌ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తెదేపా మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్యచౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్‌ గౌతు లచ్చన్న వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ నిర్మించకుంటే నేడు కృష్ణా డెల్టా ఎండిపోయేదన్నారు. కృష్ణా డెల్టాపై కక్షగట్టి ఎండగట్టేందుకే సీఎం జగన్‌ పోలవరం పనులు పూర్తిచేయలేదన్నారు. వచ్చే రెండేళ్లలో పోలవరం పూర్తి చేయకపోతే డెల్టా రైతులు రోడ్డున పడతారన్నారు. అలాంటి పరస్థితి రాకుండా ఉండాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు, కార్యశాలి పవన్‌కల్యాణ్‌, ప్రధాని మోది కూటమి తప్పక అవసరమన్నారు. పోర్టు సమీపంలో నిరుపయోగంగా ఉన్న 3 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనపై జగన్‌కు చెపితే పట్టించుకోలేదని, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఉమ్మడి ప్రభుత్వం రాగానే అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. గుడివాడలో రైల్వే ఫ్లైవోవర్‌ నిర్మాణానికి భూసేకరణకు రూ. 45 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే తానే కేంద్రంతో మాట్లాడి ఆ నిధులు విడుదల చేయించడం వల్లే నేడు పనులు జరుగుతున్నాయన్నారు. కంకిపాడు-గుడివాడ రహదారిని గ్రీన్‌ఫీల్డ్‌కారిడార్‌గా పొలాల నుంచి నిర్మాణానికి డీపీఆర్‌ కూడా తయారు చేయించానని, దీని వలన కంకిపాడు-గుడివాడ మధ్య 20 కి.మీ. దూరం తగ్గుతుందన్నారు. తొలుత రెడ్డిపాలెం నుంచి తెదేపా, జనసేన కార్యకర్తలు ర్యాలీగా వారితో తరలిరాగా కౌతవరంలో లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించారు. గుడివాడ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్‌బ్యాంక్‌ ఛైర్మన్‌ పిన్నమనేని బాబ్జి, రాష్ట్ర కార్యదర్శి శాయన పుష్పావతి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, బీసీ నాయకులు బెల్లంకొండ ఏడుకొండలు, వీరôకి గురుమూర్తి, జనసేన, భాజపా నియోజకవర్గ బాధ్యులు బూరగడ్డ శ్రీకాంత్‌, దావులూరి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని