logo

సెటిల్‌మెంట్లకు అడ్డాగా భవానీ ద్వీపం

నాడు: తెదేపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం వేదికగా తరచుగా వివిధ రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను పర్యాటక నిర్వహించేది.

Updated : 09 May 2024 05:50 IST

నాడు: తెదేపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం వేదికగా తరచుగా వివిధ రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను పర్యాటక నిర్వహించేది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చి వీక్షించే వారు. కృష్ణానదీ తీరం వెంబడి పున్నమి, దుర్గా, భవానీఘాట్‌లు వీక్షకులతో కిటకిటాలాడేవి.

నేడు: వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలకు పూర్తిగా స్వస్తి పలికింది. ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి పెట్టకపోవడం, నిధులు కేటాయింపులు చేయకపోవటంతో కార్యక్రమాల నిర్వహణ మరుగున పడింది. నదీతీర ప్రాంతం కళావిహీనంగా మారింది.

భవానీపురం, న్యూస్‌టుడే: పర్యాటక శాఖ ఆధీనంలో భవానీపురం హరిత హోటల్‌, భవానీ ద్వీపం నడుస్తున్నాయి. అందులో ఉన్న కాటేజీలను అద్దెకు ఇస్తుంటారు. కాటేజీలు రాజకీయ నాయకులకు అడ్డాగా మారాయి. పర్యాటక శాఖ బోర్డు డైరెక్టర్లు పలువురు వారి అనుచరులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు వాటిలో సెటిల్‌మెంట్లు చేస్తుంటారు. కొందరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సైతం అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం గదుల అద్దె కూడా చెల్లించకుండా రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయానికి గండి పడుతోంది. కొన్ని గదులైతే వారి కోసమే కేటాయించి ఉంచుతున్నారు. సందర్శకులు ఎవరైనా గదుల కోసం వెళ్తే కేటాయించే పరిస్థితి ఉండటం లేదు.

ఉన్నతాధికారుల సహకారం...

రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు గదులు తీసుకోవడం, వారి కార్యకలాపాలకు వినియోగించుకోవటం చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది.
పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కొందరు అలాంటి నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. కొందరు విశ్రాంత ఉద్యోగులు పర్యాటకశాఖలో తిరిగి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారు సైతం రోజుల తరబడి గదులను వినియోగించుకుంటున్నారు. వారి శాశ్వత నివాసాలుగా వాడుకుంటున్నారు. పర్యాటకశాఖకు పెద్ద ఎత్తున గండిపడుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

నాడు ఎన్నో కార్యక్రమాలు..

తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఎఫ్‌1హెచ్‌2ఓ బోటు పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఆ జరిగాయి. నావికా విన్యాసాలు అంటే విశాఖపట్నం గుర్తుకు వస్తుంది. అలాంటి నావికా విన్యాసాలను సైతం కృష్ణానదిపై నిర్వహించారు. వీటితో పాటు ఆకాశంలో దూసుకుపోయే ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ఎయిర్‌షో నగర వాసులను ఎంతగానో అలరించింది. కృష్ణానదిపై సీప్లేన్‌ దూసుకెళ్లింది. యోగా, అతిపెద్ద పూతరేకుల తయారీ, ఫుడ్‌ఫెస్టివల్స్‌ వంటివి నిర్వహించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మరుగున పడ్డాయి. ఈ అయిదేళ్లలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఒక్క కార్యక్రమమూ నిర్వహించలేదు.

కొంతకాలం కిందట ఓ మంత్రి అనుచరులు పున్నమి హోటల్‌లోని గదుల్లోనే కొన్ని రోజుల పాటు బస చేశారు. పర్యాటక శాఖకు ఎలాంటి అద్దె చెల్లించకుండా వారి సెటిల్‌మెంట్‌లు, ఇతర కార్యకలాపాలు నిర్వహించారు. గదుల్లోనే మద్యం తాగారు. జూదంతోపాటు ఇతర కార్యక్రమాలు కొనసాగించారు.

పీటీడీసీ బోర్డు సభ్యులు కొందరు హరిత హోటల్‌ గదుల్లోనే రోజుల తరబడి తిష్టవేశారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పలేదు. పర్యాటక శాఖ సిబ్బంది వారికి రాచమర్యాదలు చేశారు.

రిత హోటల్‌, భవానీ ద్వీపంలో పని చేసే పర్యాటక శాఖ సిబ్బంది ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నివాసాల్లో పనులు చేస్తున్నారు. వారికి పర్యాటక శాఖ నుంచి జీతం ఇస్తున్నారు. వారి నివాసాల్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నుంచే భోజనాలు, అల్పాహారం, అన్నీ వెళ్తుంటాయి. తద్వారా పర్యాటక శాఖ ఆదాయానికి గండిపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని