logo

మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్‌

ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు  మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్‌ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 09 May 2024 07:12 IST

మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన సోదాలు
ఘటనపై కేసు నమోదు

పోలీసులు స్వాధీనం చేసుకొన్న చీరల పెట్టెలు

పెనమలూరు, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు  మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్‌ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోరంకి ఏవీఎం గార్డెన్స్‌లోని ఓ ఇంటిపై మంగళవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. గృహాపకరణాలు, పార్టీ జెండాలు, తోరణాలు, బ్యానర్లు, ప్లాస్కులు, హాట్‌బాక్సులు వంటి 22 రకాల వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 476 చీరలు, 192 ప్లాస్కులు, 150 ఫ్రెష్‌మీల్స్‌ సెట్‌బాక్సులు, మిల్టన్‌ థర్మోవేర్‌ హాట్‌బాక్సులు 29 బ్యాగ్‌లు, పరాస్‌ హోమ్‌ వేర్‌ హాట్‌పాట్‌ బాక్సులు 46, వైకాపా గుర్తులు కలిగిన ప్యాంటు, షర్టులున్న 41 బాక్సులు, 90 స్టేషనరీ బ్యాగులు ఉండగా మిగతావి వైకాపా జెండాలు, తోరణాలు, బ్యానర్లు ఉన్నాయి. వీటిని భద్రపరిచిన ఇల్లు మండవ సతీష్‌దిగా పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.5.90 లక్షలుగా అంచనా వేశారు. ఈ ఇంటిని గత ఫిబ్రవరిలో నెలకు రూ.10 వేలు అద్దె చెల్లించే ఒప్పందంతో తీసుకొన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మనో జ్‌ అనే వ్యక్తి ఈ ఇంటిని అద్దెకు తీసుకొన్నట్లు తెలుసుకున్నారు. ఇంటి యజమాని నుంచి సేకరించిన మనోజ్‌ ఫోన్‌ నంబరుకు ఫోన్‌ చేస్తుండగా అతని నుంచి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఇంటి యజమాని తల్లి సమక్షంలో పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి ఆయా వస్తువులను పోలీసులు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో మనోజ్‌..: ఇంటిని అద్దెకు తీసుకొన్న మనోజ్‌పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అతడు గత నాలుగున్నర ఏళ్లగా తాడిగడప మున్సిపాలిటీలో గుత్తేదారుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోరంకి వైకాపాలో ఇతను కొంతకాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇతను పోరంకిలో నివసిస్తున్నాడా? లేక ఇతర ప్రాంతంలో నివసిస్తున్నాడా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మనోజ్‌ ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది తెలుసుకొనే ప్రయత్నంలో పోలీసులున్నారు. పరారీలో ఉన్న మనోజ్‌ కోసం పోలీసులు వేటాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని