logo

నాలుగేళ్లుగా నాన్చారెందుకని?

ఏం చేశారు?: ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వేదికలపై ఎమ్మెల్యే కొడాలి నాని బాకా ఊదారు. ప్రస్తుతం ప్రచార వాహనాల్లో ఆడియో, వీడియోల్లోనూ ఇదే ఉపన్యాసం ప్రసారం చేస్తున్నారు.

Published : 09 May 2024 04:16 IST

పేదల సొంతింటి కల సాకారంలో కొడాలి విఫలం
లబ్ధిదారులు నిలదీస్తున్నా స్పందించని వైనంఏం చెప్పారు?

గుడ్లవల్లేరు కాలనీలో రోడ్ల పరిస్థితి ఇదీ..

ఏం చేశారు?: ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వేదికలపై ఎమ్మెల్యే కొడాలి నాని బాకా ఊదారు. ప్రస్తుతం ప్రచార వాహనాల్లో ఆడియో, వీడియోల్లోనూ ఇదే ఉపన్యాసం ప్రసారం చేస్తున్నారు.

ఏం చేశారు?: పట్టణంతోపాటు మండలాల్లో గ్రామాలకు దూరంగా లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గృహ నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇంకా ఎంతో మంది లబ్ధిదారులున్నా స్థలాలు కేటాయించలేదు.

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం, గుడ్లవల్లేరు: భూసేకరణ లోపభూయిష్టంగా చేయడం వల్ల పేదల సొంతింటి కల నెరవేరలేదు. పల్లపు ప్రాంతాల్లో, గుంతలుగా మిగిలిన పొలాలు, కాలువ అవతల స్థలాల్లో, చెత్త కేంద్రాల వద్ద స్థలాలు సేకరించడంతో వాటిలో ఇళ్లు ఎలా నిర్మించాలని లబ్ధిదారులు ఆదిలోనే అధికారులను నిలదీశారు. దీంతో నియోజకవర్గంలో 83 లేఔట్లలో 24 లేఔట్లు రద్దు చేశారు. లేఔట్లు వేసి నాలుగేళ్లయినా మౌలిక సదుపాయాలు లేక ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇళ్లు కట్టకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటామంటూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో బెదిరించడంతో కొందరు ముందుకొచ్చారు. ఆర్థిక స్తోమత లేక వారిలో కొంత మంది మధ్యలోనే ఆపేశారు.

వివిధ కారణాలతో  రద్దు చేసిన లేఔట్లు

గుడివాడ మండలంలో శేరీ గొల్వేపల్లి, గుంటాకోడూరు, కల్వపూడి అగ్రహారం, సైదేపూడి, చౌటపల్లి, కొత్త చౌటపల్లి, వలివర్తిపాడు, తటివర్రు గ్రామాల్లో, నందివాడ మండలం జనార్దనపురం-1, గండేపూడి, పొణుకుమాడు, రామాపురం, శంకరంపాడు, పెదవిరివాడ, దండిగానపూడి, ఇలపర్రు-1, వెన్ననపూడి, కుదరవల్లి, జనార్దనపురం-2, ఇలపర్రు-2, పోలుకొండ, తమిరిశ, గుడ్లవల్లేరు, వెణుతురుమిల్లి లేఔట్లను వివిధ కారణాలతో రద్దు చేశారు. దీంతో ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలం రాలేదు.

రుణాలెందుకు  రావట్లేదు నానీ?

గుడివాడ మండలంలో 24 లేఔట్లలో 1205 మందికి స్థలాలివ్వగా వారిలో ఇప్పటికి వరకు 828 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. అర్బన్‌లో 7007 మందికి పట్టాలివ్వడానికి స్థలం సిద్ధం చేశారు కానీ 4039 మందికి మత్రామే గృహనిర్మాణ రుణ మంజూరు చేశారు. ఇక్కడ చాలా స్థలాలు ఖాళీగా ఉన్నా లబ్ధిదారులకు కేటాయించలేదు. నందివాడ మండలంలో 672 మందికి ఇళ్ల పట్టాలివ్వగా 184 మందికి మాత్రమే రుణం ఇచ్చారు. 488 మంది అర్హులకు అన్యాయం జరిగింది. గుడ్లవల్లేరు మండలంలో 2795 మందికి ఇళ్లపట్టాలు అందించగా వారిలో 1995 మందికి గృహనిర్మాణ రుణాలు మంజూరు కాకపోవడంతో ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు. అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే నాని రుణాలు ఇప్పించకపోవడానికి కారణమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

అర్హత ఉన్నా ఇవ్వలేదు

అర్హత ఉన్నా నాకు పట్టా ఇవ్వలేదు. గతంలో వలివర్తిపాడు లేఔట్లో నీకు స్థలం ఇచ్చాం కానీ అది కోర్టులో ఉందని చెప్పారు. మిగతావారందరికీ మల్లాయపాలెంలో స్థలాలిచ్చి నాకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేశారు. వృద్ధాప్యంలో ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారు.

రేమల్లి సుశీల, వలివర్తిపాడు

స్థలం చూపించ లేదు

వలివర్తిపాడు దళితవాడ పక్కన ప్లాట్లు కేటాయించినట్లు పట్టాలిచ్చారు. కానీ నేటి వరకూ స్థలం పొజిషన్‌ చూపించలేదు. లబ్ధిదారుగా చూపించినా స్థలం చూపకపోవడం వల్ల మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఓ లబ్ధిదారు

శ్మశానం పక్కన ఇల్లు కట్టలేం
శ్మశానం పక్కన ఇళ్ల స్థలాలిచ్చారు. అక్కడ ఎల్లు కట్టలేని పరిస్థితి. లేఔట్లో ఇంకా రహదారులు కూడా వేయలేదు. గృహ నిర్మాణ సామగ్రి తీసుకెళ్లేందుకు కూడా వీలు లేదు.

విజయలక్ష్మి, అంగలూరు

  • గుడ్లవల్లేరు మండలం అంగలూరు, పెంజెండ్ర, కౌతవరం, డోకిపర్రు తదితర కాలనీల్లో మట్టిరోడ్లే దిక్కు. గోతులు, ఎత్తు పల్లాలతో ఉండడంతో వర్షాకాలంలో బురదతో నానా అగచాట్లు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని