logo

రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు

మచిలీపట్నం కలెక్టరేట్‌ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత  ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు  ప్రారంభించారు.

Updated : 10 May 2024 06:46 IST

అభివృద్ధి విస్మరించిన జగన్‌

శిథిల భవనాల్లోనే ఉద్యోగులు

ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంతోపాటు రూ. కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. గత ప్రభుత్వ హయాంలో అనేక పనులు అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోతే వాటిని కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇలా ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే...సమాంతరంగా అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.

- సీఎం జగన్‌ పదే పదే చెప్పే మాట ఇది.

వాస్తవం ఇదీ: అధికార పార్టీ అభివృద్ధి అని చెప్పుకోవడమే తప్ప ఆచరణలో మాత్రం లేదనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి చివరిదశకు చేరిన భవన నిర్మాణ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఎక్కడికి అక్కడ అనేక భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా పూర్తి చేయకపోవడంతో ఉద్యోగులు శిథిల భవనాల్లో భయం భయంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. బందరు, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు కేటాయించి ప్రారంభించిన పనులు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి.

- మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నిర్లక్ష్యానికి నిదర్శనం ఆర్డీవో కార్యాలయం

 మచిలీపట్నం కలెక్టరేట్‌ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత  ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు  ప్రారంభించారు. పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించడంతో ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకున్నారు. అలా గత సాధారణ ఎన్నికల సమయానికి రూ.40లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం భవనాన్ని పూర్తి చేస్తుందేమోనని అధికారులు భావించారు. ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.

అసంపూర్తిగా మురుగునీటి శుద్ధి ప్లాంట్‌

బందరు నగరంలో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు మురుగు నీటిని శుద్ధిచేసి ఇతర అవసరాలకు వినియోగించుకునేలా అమృత్‌ పథకంలో ప్రజారోగ్యవిభాగం ఆధ్వర్యంలో రూ.16కోట్లతో మురుగునీటిశుద్ధి ప్లాంట్‌ పనులు చేపట్టారు. 2018 మే 21న పనులు ప్రారంభించగా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదిగో పూర్తిచేస్తాం అంటూ అనేక సార్లు పాలకులు ప్రటించడమే తప్ప ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకు అక్కడ రూ.8కోట్ల విలువైన పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నిధులు జాప్యం జరగడంతో పనులు ఆగిపోయాయి.

భయం భయంగా విధులు

బంటుమిల్లి తహసీల్దారు కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో  రూ.90లక్షలతో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టారు. శ్లాబు దశకు చేరిన తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. అప్పటినుంచి ఆ భవన నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోని ప్రజలతోపాటు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. చుట్టూ గోడలు నిర్మించి రంగులు వేస్తే సరిపోతుంది. అవి కూడా చేయకుండా వదిలేశారు. శ్లాబ్‌ పైభాగం పెచ్చులూడి పడిపోవడంతో  ఉద్యోగులు భయం భయంగా శిథిల భవనంలో విధులు నిర్వహిస్తున్నారు.

క్లస్టర్‌ భవనానిదీ అదే తీరు

చేనేత కార్మికులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తెదేపా హయాంలో పెడన పట్టణంలో రూ.3కోట్లతో చేనేత క్లస్టర్‌ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. 2018లో పనులు చేపట్టారు. భవనం చివరిదశకు వచ్చిన తరువాత ప్రభుత్వం  మారడంతో పనులు ఆగిపోయాయి. ఈ కేంద్రంలో అనేక ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వస్త్ర తయారీపై కార్మికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం రావడంతోపాటు కార్మికుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని