‘విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదు’
ఈనాడు, అమరావతి: జేఈఈ, నీట్లో ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నా చాలామందికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదని ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ కౌన్సిల్(సీఐఎస్సీఈ) ఛైర్మన్ ఇమాన్యుయేల్ తెలిపారు. శనివారం జరిగిన భారత పాఠశాల విద్యా బోర్డుల మండలి(సీఓబీఎస్ఈ) ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకునేలా పరీక్షలు నిర్వహించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగానే డిజిటలీకరణ, కరిక్యులమ్ ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటూ ఎక్కువగా ఆన్లైన్ చేయాలని భావించకుండా చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, దేశాలు ఏం చేస్తున్నాయో పరిశీలించాలి. స్థానిక సంప్రదాయాలు, ఆర్థిక పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని వివరించారు. అనంతరం సీఓబీఎస్ఈ ఛైర్పర్సన్ అసానో సెఖోసే మాట్లాడుతూ..‘మూడు రోజుల కార్యశాలలో వచ్చిన ఉత్తమ విధానాలను బోర్డులు అమలు చేసేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈ సమావేశాల్లో వచ్చిన ఉత్తమ విధానాలు, నిర్ణయాలను పుస్తక రూపంలో తీసుకువస్తాం’ అని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..‘‘జేఈఈ, నీట్లలో పుస్తకం చూచి రాసే(ఓపెన్ బుక్) విధానాన్ని తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 2.5% మాత్రమే విద్యకు కేటాయిస్తోంది. దీన్ని 6శాతానికి పెంచేలా ఒత్తిడి తీసుకురావాలి. దేశంలో ఇప్పటికీ 20% బడుల్లో మరుగుదొడ్లు లేవు. పిల్లలు ఎక్కువ సమయం గడిపేచోట ఈ దుస్థితి ఉంటే ఎలా?’’ అని ప్రశ్నించారు
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.