సాధారణ రకం క్వింటాల్ రూ.1,940
దుగ్గిరాల, న్యూస్‌టుడే: ఈ ఏడాది ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొంటారని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్ తెలిపారు. ఓటీఎస్ సంబంధించి మండల ప్రత్యేకాధికారిగా బుధవారం దుగ్గిరాల వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక నుంచి ధాన్యాన్ని ఆర్బీకేల నుంచే కొనుగోలు చేస్తారని, జిల్లాలో 734 ఆర్బీకేల ద్వారా 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.1940, ‘ఎ’ గ్రేడ్‌కు రూ.1960 చెల్లిస్తారన్నారు. రైతులు మధ్యవర్తుల మాటలు నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్నారు. రైతు భరోసా కేంద్రంలో అమ్ముకుంటే నేరుగా కర్షకుల ఖాతాకే నగదు జమవుతుందన్నారు. వ్యవసాయాధికారులు తెలిపిన సమాచారం మేరకు జిల్లాలో ఈక్రాప్ బుకింగ్ 99 శాతం, ఈకేవైసీ 71 శాతం పూర్తయిందన్నారు. ఇవి రెండు పూర్తిచేసిన అన్నదాతలకు చెందిన ధాన్యాన్నే కొంటారన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అధికారులు చెబుతున్న ప్రకారం అలాంటి ధాన్యం జిల్లాలో ఉండకపోవచ్చన్నారు. వర్షాల కారణంగా దిగుబడి తగ్గితే ఎకరాకు మూడు, నాలుగు బస్తాలుంటాయని, అదీ చాలా తక్కువ ప్రాంతాల్లో ఉండొచ్చన్నారు. ఇలాంటి నష్టానికి పరిహారంపై సర్వే చేశాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.