logo

అయినంత వరకు ముగించండి

విజయవాడ నగరానికి ముంపు సమస్యను తీర్చే వర్షపు నీటి మళ్లింపు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ నుంచి తప్పించనున్నారు. పురోగతిలో ఉన్న పనుల వరకు పూర్తి చేసి ప్రాజెక్టును ముగించమని పురపాలక శాఖ ఉన్నతాధికారులు

Published : 07 Dec 2021 04:30 IST

విజయవాడ వర్షపు నీటి మళ్లింపు పథకం

ఈనాడు - అమరావతి

వర్షపు నీటి మళ్లింపు పథకం నమూనా

విజయవాడ నగరానికి ముంపు సమస్యను తీర్చే వర్షపు నీటి మళ్లింపు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ నుంచి తప్పించనున్నారు. పురోగతిలో ఉన్న పనుల వరకు పూర్తి చేసి ప్రాజెక్టును ముగించమని పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ప్రారంభించని పనుల పర్యవేక్షణ బాధ్యతను వీఎంసీకి అప్పగించే అవకాశం ఉందని సమాచారం. పనులు తమకు బదలాయించమని ప్రభుత్వానికి వీఎంసీ కమిషనర్‌ లేఖ రాశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదలు కాని పనులకు టెండర్లు పిలిచి, వాటిని గుత్తేదారులకు నగరపాలక సంస్థ అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులో అసంపూర్తిగా..

ఎడతెగని జాప్యం

రూ. 362.43 కోట్లకు 2016, సెప్టెంబరులో ప్రభుత్వం.. ఎల్‌అండ్‌టీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2017, ఏప్రిల్‌లో మొదలైన ఇప్పటి వరకు 58 శాతమే పూర్తి అయ్యాయి. ఒప్పందం ప్రకారం ఆగస్టు, 2019 నాటికి నిర్మాణం చేయాల్సి ఉంది. బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడంతో నత్తనడకన సాగాయి. మొత్తం 443.75 కి.మీ మేర మురుగునీటి కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు మేజరు డ్రెయిన్లు.. 62 కి.మీ, మైనర్‌ డ్రెయిన్లు.. 197 కి.మీ చొప్పున 252.14 కి.మీ మాత్రమే పూర్తి చేయగలిగారు.

* పలు చోట్ల రోడ్ల వెడల్పు, ఆక్రమణల తొలగింపు కారణంగా 60 డ్రెయిన్ల నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దీనికి తోడు రెండు చోట్ల కోర్టు కేసులు కూడా తోడయ్యాయి.

* రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ, ర.భ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం.

తాగునీటి, విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు పనులు సజావుగా జరగలేదు.

ఇసుక కొరత వల్ల ఎక్కువ కాలం పనులు ఆగిపోయాయి.

ఏడాదిగా రూ. 40 కోట్లు పెండింగ్‌

ప్రాజెక్టుకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌లో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ను తొలగించారు. దాదాపు ఏడాది నుంచి ఇదే పరిస్థితి. ఈ పేరతో ఐడీ ఉంటుంది. సీఎఫ్‌ఎంఎస్‌లోకి లాగిన్‌ అయి పెండింగ్‌ బిల్లులను అధికారులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఐడీ తొలగించడం వల్ల బిల్లులను అప్‌లోడ్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు రూ. 170 కోట్లను గుత్త సంస్థకు ప్రభుత్వం చెల్లించింది. మరో రూ. 40 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పూర్తి చేయాల్సిన డ్రెయిన్లను అనుసంధానానికి వీలుగా సిద్ధం చేసి అప్పగించాల్సి ఉంటుంది. అడ్డుగా ఉన్న విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తరలించడానికి విద్యుత్తు శాఖకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీనికి కూడా నిధులు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 754 కి.మీ మేర కాలువల నిర్మాణం ఆగిపోయింది. తమ ఆధీనంలోని పనులకు సంబంధించి ఎల్‌అండ్‌టీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని