logo

తాడేపల్లిలోనూ వాళ్లేనా?

విజయవాడ నగరంలో రెండు ఘటనల తర్వాత దోపిడీ ముఠా గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోరీకి యత్నించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన తాడేపల్లిలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి ప్రయత్నించి

Updated : 07 Dec 2021 06:24 IST

సరిపోలిన ఇద్దరి ఆనవాళ్లు

ఈనాడు - అమరావతి

తాడేపల్లిలో చోరీకి యత్నించిన ఇంటిని పరిశీలిస్తున్న కానిస్టేబుల్‌

విజయవాడ నగరంలో రెండు ఘటనల తర్వాత దోపిడీ ముఠా గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోరీకి యత్నించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన తాడేపల్లిలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి ప్రయత్నించి విఫలమైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ తెల్లవారుజామున అపార్ట్‌మెంట్‌లోకి చొరబడినట్లు సీసీ కెమరాలో రికార్డు అయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు ఓ బృందాన్ని తాడేపల్లికి పంపించారు. వారి కదలికలు ఇంచుమించు నగరంలో తెగబడిన వారిలాగే ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. తాడేపల్లి దోపిడీ యత్నం దృశ్యాలు పరిశీలించిన నగర పోలీసులు, అందులో ఇద్దరు విజయవాడలో పాల్గొన్న ముఠాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ మూడు ఒకే ముఠా చేసినవి అని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. 

విజయవాడ నగరంలో రాత్రి సమయాలలో ఐదు డివిజన్లలో ఐదు సాయుధ బృందాలు గస్తీ కాస్తున్నారు. పగటి పూట కూడా రైలు పట్టాలు, రహదారుల వెంబడి, శివారు ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు తిరుగుతున్నారు. అనుమానాస్పదంగా తిరిగే వారిపై నిఘా ఉంచుతున్నారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ముఠాగా భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఘటన మరుసటి రోజే తాడేపల్లిలో దోపిడీకి యత్నించారు. ప్రయత్నం విఫలం కావడంతో ఇక్కడే ఉన్నారా? లేక మరో జిల్లాకు వెళ్లారా? అన్న దానిపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. 

* దొంగలు సెల్‌ఫోన్‌ ఏమైనా వాడారా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాలఫ్యాక్టరీ, గుంటుపల్లిలోని సెల్‌టవర్‌ డంప్‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. తాజాగా.. తాడేపల్లి పోలీసుల నుంచి అక్కడి డంప్‌ను కూడా తీసుకున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఏమైనా కాల్స్‌ వెళ్లాయా? ఏయే నెంబర్ల నుంచి ఎక్కడికి వెళ్లాయన్నది క్షుణ్ణంగా అన్వేషిస్తున్నారు. ఈ ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిందితులకు సంబంధించి సమాచారాన్ని తాడేపల్లి, విజయవాడ పోలీసులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని