logo

రైవస్‌ కాల్వలో విద్యార్థి గల్లంతు?

వాంబేకాలనీలోని జంధ్యాల దక్షిణామూర్తి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గుంటూరు యశ్వంత్‌(10) ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  కాలనీలో నివాసముంటున్న గుంటూరు

Published : 09 Dec 2021 04:05 IST

యశ్వంత్‌ (పాత చిత్రం)

పాయకాపురం (అజిత్‌సింగ్‌నగర్‌), న్యూస్‌టుడే : వాంబేకాలనీలోని జంధ్యాల దక్షిణామూర్తి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గుంటూరు యశ్వంత్‌(10) ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.  కాలనీలో నివాసముంటున్న గుంటూరు శివాజీ, దుర్గ దంపతుల కుమారుడైన యశ్వంత్‌.. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్న సమయంలో టాయ్‌లెట్‌కు అని చెప్పి వెళ్లి, ఆ తర్వాత నుంచి కనిపించ లేదు. బాలుడి తల్లి నున్న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. బుధవారం విచారణ ప్రారంభించారు. కాలనీలో స్థానికంగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులతో కలిసి కాలనీలోని రైల్వే ట్రాకు దాటి నగరంలోకి వచ్చిన యశ్వంత్‌.. గుణదల పప్పులమిల్లు సెంటరులోని రైవస్‌ కాల్వ వద్దకు వెళ్లినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఆ ఇద్దరు చిన్నారులతో కలిసి స్నానం చేసేందుకు కాల్వలో దిగాడని, నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడని తెలుసుకున్నారు. కాల్వ అంచు వెంబడి యశ్వంత్‌ వేసుకున్న చొక్కా, చెప్పులను గుర్తించారు. కాల్వలో గల్లంతయ్యి ఉంటాడన్న అనుమానంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో గాలించారు. పడవల రేవు ప్రాంతం నుంచి సుమారుగా 6 నుంచి 7 కిలో మీటర్ల మేరకు(అంకమ్మ తల్లి దేవాలయం వరకు) ప్రత్యేక బోటు సాయంతో వెతికారు. ఈ విషయమై నున్న సీఐ హనీష్‌బాబు మాట్లాడుతూ... బాలుడు రైవస్‌ కాల్వలో దిగినట్లుగా సమాచారం ఉందని, దుస్తులు ఆ ప్రాంతంలోనే లభించడంతో ధ్రువీకరణ చేసుకుని గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం చీకటి పడే సమయం వరకు గాలించినా ఆచూకీ తెలియక పోవడంతో ఆపేశామని, గురువారం గాలింపు చర్యలను కొనసాగిస్తామని ఆయన వివరించారు.

బాలుడి కోసం గాలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, నున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని