logo

కలవరం

ఖరీఫ్‌లో కురిసిన వర్షాల కారణంగా వరి పంట నష్టపోవాల్సి వచ్చింది. రబీలో సాగు చేసిన అపరాల పంటతోనైనా కొంత ఊపిరి పీల్చుకుందామనుకున్న రైతులను ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు

Published : 15 Jan 2022 03:59 IST

అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ఏటిమొగలో పరదాలతో కప్పిన వరి ధాన్యపు రాశులు

ఖరీఫ్‌లో కురిసిన వర్షాల కారణంగా వరి పంట నష్టపోవాల్సి వచ్చింది. రబీలో సాగు చేసిన అపరాల పంటతోనైనా కొంత ఊపిరి పీల్చుకుందామనుకున్న రైతులను ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో ఈ పంట కూడా దక్కుతుందో లేదోనని ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.24లక్షల ఎకరాల్లో మినుము సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, బందరు, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, తోట్లవల్లూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి ఇలా అనేక మండలాల్లో ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంలో అన్ని పొలాల్లోనూ నీళ్లు నిలబడిపోయాయి. రైతులు అందరూ ఇటీవల పంటకు నీటి తడులు అందించగా ఆ వెంటనే వర్షం పడటంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. పెనమలూరు, గుడివాడ, నందివాడ, బాపులపాడు, ఉంగుటూరు, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో 12వేల ఎకరాలకు పైగా పెసర పంట సాగయ్యింది. ఈ చేలల్లోనూ నీరు చేరడంతో బయటకు పంపే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇలాగే వర్షాలుపడితే పంట కుళ్లిపోతుందని ఆందోళన చెందుతున్నారు.

వరి కుప్పల్లోకీ... : ఖరీఫ్‌లో సాగైన వరిపంటకు సంబంధించి 11 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వస్తుందని, వాటిలో 8.40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 4లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 4.40లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పంట అంతా పొలాల్లొనే కుప్పల రూపంలో ఉంది. అసలే ధాన్యం డబ్బులు సకాలంలో జమకాక, సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు మినుము పంట నూర్చిన తరువాత కుప్పలు తీయవచ్చని అనుకుంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పొలాల్లోకి చేరిన నీరు కుప్పల్లోకి చేరుతోంది. దీంతో మినుముపంటతోపాటు వరిపంట కూడా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి, ఇతర వాణిజ్య పంటలు కూడా వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి.

హనుమంతపురంలో నీటిలోని ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతులు

దివిసీమలో అపార నష్టం

నాగాయలంక, పమిడిముక్కల, న్యూస్‌టుడే: అల్పపీడనం ప్రభావంతో మూడు జులుగా కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోని ధాన్యం తడిసి, మినుము, మొక్కజొన్న పైరులో నీరు చేరడంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మొక్కదశలో ఉన్న మినుముపైరుకు నష్టం వాటిల్లుతుందని ఆవేదాన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో వరి పంటను రైతులు మిషను ద్వారా నూర్చి కల్లాల్లో ఆరబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో ధాన్యాన్ని ఎక్కడికక్కడ రాశులు చేసి పరదాలు కప్పారు. పమిడిముక్కల మండలం హనుమంతపురానికి చెందిన కౌలురైతు శొంఠి నాగశ్రీనివాసరావు, మరో రైతు రాజులపాటి కృష్ణారావు వరుసగా ఆరు, 11 చొప్పున ఎకరాల్లో నూర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తోలేందుకు ఆరబెట్టగా ఈ వర్షంతో సగం ధాన్యం నీటముంపునకు గురైనట్లు తెలిపారు. కూడేరు, ఐనపూరు, లంకపల్లి మెట్టభూముల్లో సాగైన సుమారు 600 ఎకరాల్లోని మొక్కజొన్న పైరు వర్షాలకు నేలకొరిగింది. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో ఈ వర్షంతో మరోమారు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు

నీరు బయటకు పంపాలి

పొలాల్లో చేరిన నీరు అలాగే నిల్వ ఉంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతుందరూ వెంటనే బయటకు పంపేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. జిల్లాలో మండలాల వారీగా ఏయే పంటలకు ఎంత మేర నష్టం వాటిల్లిందనేది వివరాలు సేకరిస్తున్నాం. జరిగిన నష్టాన్ని బట్టి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయం అందించేందుకు కృషి చేస్తాం.

- మోహన్‌రావు, వ్యవసాయశాఖ జేడీ

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని