Somu Veerraju: ఉద్యోగులను రోడ్లమీదికి తెచ్చిన ఘనత జగన్‌దే: సోము వీర్రాజు

ఏపీ ప్రభుత్వం ఆర్థికలేమితో సతమతమవుతోందని.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని భాజపా

Updated : 25 Jan 2022 14:20 IST

ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా భాజపా ‘నిరసన దీక్ష’

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆర్థికలేమితో సతమతమవుతోందని.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉద్యోగులను రోడ్లమీదికి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా.. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా విజయవాడలో భాజపా నేతలు ‘నిరసన దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పోరాటానికి భాజపా పూర్తి మద్దతు పలుకుతోందని చెప్పారు. ఎర్రచందనాన్ని ఇష్టానుసారంగా అమ్ముకొంటున్నారని ఆరోపించారు. ఆదాయవనరులన్నీ అధికార పార్టీ పరం అయ్యాయని.. ప్రజలకు మాత్రం అప్పులు మిగిలాయి సోము వీర్రాజు ఆక్షేపించారు.

భాజపా ముఖ్యనేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని వ్యవస్థలు, సంస్థలను సీఎం జగన్‌ నాశనం చేశారని ఆరోపించారు. మైనింగ్‌, లిక్కర్‌ వ్యాపారం మాత్రం లాభాల్లో నడుస్తోందని. అధికార పార్టీ  నాయకుడిని విమర్శిస్తే అరెస్ట్‌ చేస్తున్నారని.. దోపిడీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గుడివాడలో క్యాసినో జరగలేదని బుకాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకే జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. అడగనిది చేయడం.. అడిగింది చేయకపోవడం జగన్‌ నైజమని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని