logo

‘నాడు’ రూ.లక్షలు ఖర్చు పెట్టారు..

రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించింది. అంత ఖర్చు చేసిన ప్రాథమిక పాఠశాలలను ప్రస్తుతం ప్రభుత్వం విలీనం చేయడంతో రూ.లక్షల ప్రజాధనం వృథాగా మారే అవకాశం

Published : 10 Aug 2022 05:10 IST

‘నేడు’ విలీనం చేశారు

ధర్మవరం, తాడిమర్రి, నల్లచెరువు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించింది. అంత ఖర్చు చేసిన ప్రాథమిక పాఠశాలలను ప్రస్తుతం ప్రభుత్వం విలీనం చేయడంతో రూ.లక్షల ప్రజాధనం వృథాగా మారే అవకాశం ఉంది. విలీనం చేస్తున్న పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెబుతున్నా వాటికి ఒక గది ఉంటే చాలని, మరి మిగిలిన గదుల సంగతి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

విలువైన వస్తువుల మాటేంటి..?

నాడు- నేడు మొదటి విడతలో అధికారులు ఎంపిక చేసిన ప్రతి పాఠశాలకు రూ.10 లక్షలకు పైగా నిధులు మంజూరు చేశారు. వాటితో మరుగుదొడ్లు, ఆర్‌వో నీటి ప్లాంట్‌, విలువైన ఫర్నీచర్‌, ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. విలువైన సామగ్రిని వినియోగించకపోతే కొన్ని రోజులకు పాడవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విలీనం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇలా రూ.లక్షల ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
నల్లచెరువు మండలం తవళంమర్రి ప్రాథమిక పాఠశాలకు నాడు- నేడు పథకంలో రూ.18 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాఠశాలలోని 3,4,5 తరగతులను తవళంమర్రి ఉన్నతపాఠశాలలో విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం 12 మంది విద్యార్థులు ఉన్నారు. బడిలో మొత్తం ఐదు గదులు ఉండగా మూడు గదులను మూసివేశారు. మిగిలిన రెండు గదుల్లో 1,2 తరగతులు కొనసాగుతున్నాయి.

తాడిమర్రిలోని ప్రాథమిక పాఠశాలకు (బంగ్లా బడి) నాడు- నేడు పథకం కింద రూ.18 లక్షలు మంజూరు కాగా వాటితో పనులు చేయించారు. గతేడాది బడిలో 1 నుంచి 5 తరగతుల్లో 96 మంది విద్యార్థులు చదివారు. ప్రస్తుతం తాడిమర్రి ఉన్నతపాఠశాలలో విలీనం అవడంతో ఇప్పుడు 1, 2 తరగతుల్లో 20 మందే ఉన్నారు. వీరిలో కూడా కొందరు టీసీలు తీసుకుని ప్రైవేట్‌ పాఠశాలలో చేరేందుకు సిద్ధమవుతుంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులను బతిమాలి పాఠశాలలోనే కొనసాగేలా చేశారు. మూడు గదులకు ఉపాధ్యాయులు తాళాలు వేశారు.

విలీనంలోకి 481 పాఠశాలలు..

ఉమ్మడి జిల్లాలో 481 ప్రభుత్వ పాఠశాలలు విలీనం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,662 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో మొదటి విడతలో నాడు-నేడు పథకానికి 1,294 పాఠశాలలను ఎంపిక చేసి రూ.320 కోట్లను ఖర్చు చేశారు. కొన్ని మండలాల్లో విలీనం అవుతున్న పాఠశాలలను రెండో విడతలో నాడు-నేడుకు ఎంపిక చేశారు. 1, 2 తరగతులు ఉన్న పాఠశాలలకు అధికారులు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు లేని పాఠశాలలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసినా ఏం ఉపయోగముంటుందని, అభివృద్ధి అంటే ఏళ్ల తరబడి అందరికీ ఉపయోగ పడేలా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు - మీనాక్షి, డీఈవో, శ్రీసత్యసాయి జిల్లా

విలీనంతో మిగిలిన పాఠశాల తరగతి గదులపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. పాఠశాలలో ఉన్న విలువైన వస్తువులు నిరుపయోగంగా ఉండకుండా చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని