logo

నిలువ నీడేదీ జగన్‌?

అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి.

Published : 27 Apr 2024 03:46 IST

బస్‌ షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. పాత బస్టాండు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రతి నెలా పాత బస్టాండులో వ్యాపార దుకాణాల ద్వారా రూ.లక్షల ఆదాయాన్ని పొందుతున్నా దేవాదాయశాఖ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో విఫలమైంది. గతంలో నిర్మించిన రెండు బస్సు షెల్టర్లులో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. రాణిఛత్రం వద్ద ఉన్న బస్సుషెల్టరులో ప్రయాణికులు కూర్చొనేందుకు అవసరమైన కుర్చీలు కాని రాతి పలకలు లేకపోవటంతో ప్రయాణికులు నేల అరుగులపైనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. మరుగుదొడ్డి సమీపంలో నిర్మించిన మరొక చిన్న బస్సు షెల్టర్‌లో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు లేవు. విద్యుత్తు దీపాలు కూడా లేవు.

ఇక బళ్లారి బసాండులోదాత నిర్మించిన బస్సు షెల్టరు ఉన్నా ప్రయాణికులకు అనువుగా లేదు. ప్రయాణికులు వ్యాపార దుకాణాల ముందు నీడలో కూర్చోవాల్సి వస్తోంది. మొలకాల్మూర్‌ బస్టాండులో ప్రాంగణం లేదు. బళ్ళారి, మొలకాల్మూర్‌ రోడ్డులోని బస్టాండ్లలో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మొలకాల్మూర్‌ రోడ్డులోగతంలో చేపట్టిన రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అధికారులు రాజకీయాలకు వెరసి నిబంధనలను పాటించకపోవటంతో రోడ్డు కుచించుకుపోయి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. అనంతపురం రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద కూడా దాతలు నిర్మించిన బస్సు షెల్టర్‌ చిన్నగా ఉండటంతో ప్రయాణికులు దుకాణాల ముందు తలదాచుకోవాల్సి వస్తోంది. జమ్మిచెట్టు వద్ద గతంలో దాతలు నిర్మించిన ప్రాంగణాన్ని రోడ్డు విస్తరణ సమయంలో కూల్చేశారు. తెదేపా హయాంలో ఎంపీలు బస్సు షెల్టర్లు తమ కోటా నిధులతో నిర్మించారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య రాయదుర్గం బస్‌ షెల్టర్‌ గురించి పట్టించుకోలేదు.దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వైకాపా పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా బస్సు ఛార్జీలు పెంచటం తప్ప సౌకర్యాలను ఏమాత్రం పట్టించుకోలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని