logo

భవన నిర్మాణ కార్మిక జీవనం.. జగన్ పాలనలో ఛిద్రం

రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది.

Updated : 27 Apr 2024 05:29 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భవన నిర్మాణ (అన్ని విభాగాలు) కార్మికులు సుమారు 5 లక్షలు
అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే

రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది. సులువుగా దొరికే ఇసుకను అడ్డంగా తవ్వేసి.. అడ్డదారుల్లో అధిక ధర అమ్మేసుకుని.. ఇదే ఇసుకపై ఆధారపడే భవన నిర్మాణ కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసింది. సంక్షేమ బోర్డు నిధులను సైతం దారి మళ్లించి.. కార్మిక ప్రయోజనాలను అటకెక్కించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది భవన నిర్మాణ కుటుంబాలు అర్ధాకలితో అలమటించే దుస్థితికి తీసుకొచ్చిన ఘనత వైకాపా సర్కార్‌కే దక్కింది.

కుదేలైన నిర్మాణ రంగం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం, చేనేత రంగాల తర్వాత నిర్మాణ రంగమే కీలకం. లక్షలాది కుటుంబాలు ఆధారపడ్డాయి.  తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం తీసికట్టుగా మారడంతో గ్రామాల్లో పనులు దొరకడం గగనమైంది.అనంత నగరం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, మడకశిర, కదిరి తదితర ప్రాంతాల్లో బేల్దారి పనులే దిక్కుగా మారాయి. ఆరు మాసాల పాటు కరోనా మహమ్మారి దెబ్బతీస్తే... తక్కిన నాలుగున్నరేళ్లలో వైకాపా ప్రభుత్వం కొత్త ఇసుక విధానంతోపాటు ఇనుము, ఇటుకల ధరల పెరుగుదల భవన కార్మికుల నడ్డి విరిచింది.

అటకెక్కిన సంక్షేమం

కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఉంది. గుత్తేదారుల సెస్‌, సభ్యత్వ రుసుం రూపంలో ఏటా రూ.కోట్లు బోర్డుకు జమ అవుతుంది. దీనికి సమాన గ్రాంటు ఇచ్చి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డు నిధులు ఏమయ్యాయో తెలియదు. నవరత్నాల పథకాలే అందిస్తున్నామంటూ అదనపు ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది. కరోనా కాలంలో నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూ.189 కోట్లు రాష్ట్రానికి కేటాయించింది.  అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామంటూ వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దరఖాస్తులు సైతం స్వీకరించారు. ఎవరికి ఇచ్చారన్నది స్పష్టత లేదు.


పనుల్లేక పస్తుండాల్సిన పరిస్థితి

తాడిపత్రి: పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయయణ పదేళ్లుగా పెయింటింగ్‌ పనినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక సులువుగా దొరకడంతో భవన నిర్మాణాలు ఎక్కువగా జరిగేవి. దీంతో పనులు ఎక్కువగా దొరికేవి. దీంతో తనకున్న ఇద్దరు పిల్లలను బాగా చదివించుకుంటుండేవారు. వైకాపా ప్రభుత్వం రాగానే ఇసుకను ప్రైవేటీకరణ చేయడంతో నిర్మాణాలు తగ్గి వారంలో మూడురోజులైనా పనిదొరకని పరిస్థితి. ఒక్కో సమయంలో పనులు లేక పస్తుండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని లక్ష్మీనారాయణ వాపోతున్నారు.


నెలలో పది రోజులే ఉపాధి

హిందూపురం అర్బన్‌: మండలంలోని చలివెందులకు చెందిన నరసప్ప 20 ఏళ్లుగా బేల్దారి పనులు చేస్తున్నారు. తెలుగుదేశం పాలనలో చేతినిండా పని దొరికేది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిమెంట్‌, ఇనుము, ఇసుక ధరలు పెరగడంలో భవన నిర్మాణాలు తగ్గిపోవడంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. దీనివల్ల రోజూ పనులకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి. నెలరోజుల్లో కనీసం పదిరోజులు పనులు దొరికితే మిగిలిన రోజులు ఇంటి వద్దె ఉంటున్నారు. దీనివల్ల భార్య, నలుగురు సంతానం పోషించుకొనేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ఎలాంటి ఆదాయం, భూములు లేక నరసప్ప కష్టంపైనే కుటుంబం ఆధారపడింది.


తెదేపా హయాంలో ఇలా...

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అదనపు ప్రయోజనాలను కల్పించింది. ప్రసూతి సాయం, పని ప్రదేశాల్లో చనిపోయినా, అంగవైకల్యం పొందినా, సహజ మరణానికి, వివాహ కానుక, వైద్యసాయం... ఇలా అనేక రూపాల్లో తెదేపా ప్రభుత్వం కార్మిక కుటుంబాలకు మేలు చేసింది. క్రమంగా సంక్షేమ బోర్డు నుంచి నిధుల చెల్లింపు, క్లెయిమ్‌ల పరిష్కారం సాగింది. నైపుణ్య శిక్షణ, తగిన కిట్లను సైతం అందించింది. వైకాపా ప్రభుత్వం క్లెయిమ్‌ల పరిష్కారాన్ని అటకెక్కించింది. ఉమ్మడి జిల్లాలో 1743 క్లెయిమ్‌లను పెండింగ్‌లో పెట్టింది.


సంక్షేమ బోర్డు నిర్వీర్యం

- జి.రామకృష్ణ, అధ్యక్షుడు, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం

భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినడానికి వైకాపా ప్రభుత్వ నిర్ణయాలే కారణం. ఇసుక విధానాన్ని ఆన్‌లైన్‌ చేసి.. కార్మికులకు పనులు లేకుండా చేసింది. నగర, పట్టణాల్లో నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదు. ఇది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సంక్షేమ బోర్డును జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. నిధులను ప్రభుత్వమే దారి మళ్లించింది. కార్మికుల జీవనం దయనీయంగా మారింది.


కార్మికుల పొట్ట కొట్టారు..

- యు.శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం

ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని అన్యాయం చేసింది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో చాలా మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వలేదు. ఐదేళ్లుగా ఒక్క క్లెయిమ్‌ చెల్లించలేదు. ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని