logo

నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ

తమది రైతు ప్రభుత్వమని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది.

Published : 27 Apr 2024 03:38 IST

ఐదేళ్లుగా బుక్కపట్నం చెరువు ముంపు గ్రామాల గోడు పట్టని ప్రభుత్వం
392 మంది రైతులకు రూ.158 కోట్లతో ప్రతిపాదనలకే పరిమితం

పుట్టపర్తి, బుక్కపట్నం, న్యూస్‌టుడే: తమది రైతు ప్రభుత్వమని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. భారీ చెరువు కావడం, పూర్తిస్థాయిలో నింపడంతో అప్పటి వరకు సాగులో ఉన్న పరిసర మూడు మండలాల్లోని వ్యవసాయ బోరుబావులు, పండ్లతోటలు, పంటలు మునిగిపోయాయి. దీంతో తమకు పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపునకు గురైన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని, ముఖ్యమంత్రిగా జగన్‌ ఎన్నికైన వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఐదేళ్లు అవుతున్నా.. సంబంధిత అధికారులు పరిశీలించడం.. నివేదికలు రూపొందించడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చింది లేదు.

బుక్కపట్నం చెరువు ప్రాంతంలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు చెందిన 392 మంది రైతులకు చెందిన 465.57 ఎకరాలు సాగు భూమి ఉంది. భూముల్లో వరి, మొక్కజొన్న, మామిడిచెట్లు, కూరగాయలు సాగు చేసి జీవనం సాగించేవారు. 2018లో హంద్రీనీవా నీటితో చెరువును నింపడంతో 392 మంది రైతులు వ్యవసాయ సాగు భూములు కోల్పోయారు. దీంతో అధికారులు పరిశీలించి 465.57 ఎకరాల భూములకు సంబంధించి రూ.158 కోట్ల పరిహారం అందించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పరిహారం అందుతుందనే ఆశతో రైతులు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ముంపు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు.

నయాపైసా విదల్చలేదు..

రైతులు ఉమ్మడి కలెక్టరేట్‌, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో 30 సార్లు స్పందన కార్యక్రమంలో పరిహారం అందించాలని అర్జీలు అందజేశారు. సాగు భూములు కోల్పోయి, ఉపాధి లేక కుటుంబపోషణకు కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. పరిహారం అందక, ఉపాధి లేక దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముంపు భూములను పరిశీలించారు. నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని, త్వరలో రైతులకు పరిహారం అందిస్తామని రెండోసారి హామీ ఇచ్చారు. ఐడేళ్లు గడిచినా నయా పైసా కూడా పరిహారం అందలేదు.


నమ్మించి మోసం చేశారు

- రాఘవ, పుట్టపర్తి

పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ఐడేళ్లుగా ప్రదక్షిణ చేస్తున్నా. సాగు భూమి, బోరుబావి కోల్పోయాను. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐడేళ్లు గడిచినా నయా పైసా కూడా పరిహారం అందలేదు. పొలంలోకి వెళ్లే పరిస్థితి లేదు. పరిహారం ఇవ్వాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. నమ్మించి మోసం చేశారు.


ఉన్న భూమిని కోల్పోయా

- నాగభూషణ, జానకంపల్లి

దశాబ్దాలు కాలంగా సాగు చేస్తున్నా. వ్యవసాయ భూమి ముంపునకు గురికావడంతో ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, 1.70 ఎకరాలు భూమిని కోల్పోయా, ప్రతి ఏటా వరి, మొక్కజొన్న పంట సాగు చేసి కుటుంబాన్ని పోషించేవాడిని. ఐదేళ్లుగా ముంపు గురికావడంతో సాగు చేసే అవకాశం లేకుండాపోయింది. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నా, పరిహారం అందించి ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని